వరంగల్ జిల్లాలో రెండో ఒమిక్రాన్ కేసు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో మొదలైన ఈ వేరియంట్ ప్రపంచంలోని వందకు పైగా దేశాలకు విస్తరించింది. ముఖ్యంగా యూకేలో లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు సంఖ్య 2 లక్షలకు చేరువైంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 30కి పైగా మరణాలు నమోదయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతుండడం రాష్ట్ర ప్రభుత్వాన్ని , ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

తాజాగా వరంగల్ జిల్లాలో రెండో ఒమిక్రాన్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వరంగల్ బ్యాంక్ కాలనీకి చెందిన 24ఏళ్ల యువకుడు ఈ నెల 12న స్విట్జర్లాండ్ నుంచి తిరిగి వచ్చాడు. ఆర్టీ పీసీఆర్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. దీంతో అధికారులు అతని శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపగా ఒమిక్రాన్ గా నిర్థారణ అయింది. దీంతో బాధితున్ని హైదరాబాద్ లోని టిమ్స్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అతని కుటుంబసభ్యులతో పాటు దాదాపు 20 మందికి కరోనా టెస్టులు నిర్వహించి ఫలితం కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా ఇండియాలో 578 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 151 మంది ఓమిక్రాన్ బారి నుంచి బయటపడ్డారు. దేశంలో ఢిల్లీ, మహారాష్ట్రలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఈ రాష్ట్రాల్లో ఒక్కో రాష్ట్రంలో 140కి పైగా ఓమిక్రాన్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. వీటి తరువాతి స్థానాల్లో కేరళ, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ ఓమిక్రాన్ కేసుల్లో దేశంలో ఆరోస్థానంలో ఉంది.