కార్వీ తరహా ఘటనలను రిపీట్‌ కానివ్వం!

ajay tyagi
ajay tyagi

హైదరాబాద్‌: క్యాపిటల్‌ మార్కెట్లో కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ తరహా ఘటనలను నివారించేందుకు నిబంధనలు మరింత పటిష్ఠం చేయనున్నట్లు సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి వెల్లడించారు. ఇందుకు సంబంధించి త్వరలోనే సర్క్యులర్‌ను జారీ చేయనున్నట్లు సెబీ బోర్డు సమావేశం అనంతరం ఆయన మీడియాకు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎ్‌సబీఎల్‌).. క్లయింట్ల షేర్లను దుర్వినియోగపర్చింది. 95,000 మంది క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన షేర్లను వారి అనుమతి లేకుండానే తనఖా పెట్టి రూ.600 కోట్ల రుణం తీసుకుంది. దాంతో సెబీ ఈ బ్రోకింగ్‌ సంస్థపై నిషేధం విధించింది. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లు కార్వీ లైసెన్సును రద్దు చేశాయి. ఈ ఉదంతంపై త్యాగి ఇంకా ఏమన్నారంటే.. ఈ నెల 14 నాటికి కార్వీ చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.1,189 కోట్లు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద కార్వీకి చెందిన రూ.511 కోట్ల విలువైన సెక్యూరిటీలున్నాయి. మిగతా రూ.678 కోట్ల బకాయిలు రికవరీ కావాల్సి ఉంది. తన గ్రూపు కంపెనీలో వాటా విక్రయించడం ద్వారా మార్చి చివరి నాటికి మిగతా బకాయిలు చెల్లిస్తామని ఎన్‌ఎ్‌సఈకి కార్వీ సమాచారం అందించింది. అప్పటి వరకు వేచి చూస్తాం. బకాయిలు తీర్చని పక్షంలో కంపెనీపై తగిన చర్యలు చేపడతాం. కార్వీ విషయంలో క్లయింట్లకు చెందిన సెక్యూరిటీలు, సొమ్ము తిరిగి వారికి అందజేయడమే నియంత్రణ సంస్థ తొలి ప్రాధాన్యత అని తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/