నేటి నుంచి 13 వరకు పలు రైళ్ల రద్దుః దక్షిణ మధ్య రైల్వే

నిర్వహణ కారణాలు, ఒడిశా ప్రమాదం నేపథ్యంలో నిర్ణయం

scr-cancelled-trains-till-june-13

న్యూఢిల్లీః ఒడిశాలోని బాలాసోర్‌‌లో జరిగిన రైళ్ల ప్రమాదంతో ఇప్పటికే పలు రూట్లలో రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే బుధవారం నుంచి ఈ నెల 13 వరకు మరికొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బాలాసోర్ ప్రమాదంతో పాటు నిర్వహణ కారణాల వల్ల వీటిని రద్దు చేసినట్టు తెలిపింది. నిజామాబాద్‌–కాచిగూడ, కాచిగూడ–నిజామాబాద్‌, నిజామాబాద్‌–నాందేడ్, నాందేడ్‌–నిజామాబాద్‌ రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. వీటితోపాటు డౌండ్–నిజామాబాద్, ముద్ఖేడ్–నిజామాబాద్ రైలు బుధవారం నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేసింది. నిజామాబాద్–పంధర్పూర్, నిజామాబాద్– ముద్ఖేడ్ రైళ్లను గురువారం నుంచి ఈ నెల 14 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

బెంగళూరు–హౌరా రైలును రేపటి వరకు రద్దు చేశారు. శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం– హౌరా, వాస్కోడిగామా–షాలిమార్, కాచిగూడ, బెంగళూరు అగర్తలా ఎక్స్‌ప్రెస్‌లను గురువారం వరకు రద్దయ్యాయని, ప్రయాణికులు గమనించాలని అధికారులు సూచించారు. మరోవైపు వేసవి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న పలు రైళ్లను పొడిగించారు.

కాచిగూడ–తిరుపతి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల8 వరకు, తిరుపతి–కాచిగూడ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 9 వరకు, కాచిగూడ–కాకినాడ టౌన్ మధ్య నడిచే రైలును ఈ నెల 10 వరకు, కాకినాడ టౌన్–కాచిగూడ స్పెషల్ ను ఈ నెల 11వరకు, కాచిగూడ–నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ను ఈ నెల8 నుంచి 29 వరకు, నర్సాపూర్–కాచిగూడ స్పెషల్ ట్రైన్ ను 9 నుంచి 30 వరకు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.