నేటి నుండి పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు ప్రారంభం
అసోం, జమ్మూకశ్మీర్, చండీగఢ్‌లలో తెరుచుకున్న బడులు

అసోం: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆరునెలల పాటు మూతపడిన పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. దేశంలోని అన్ని పాఠశాలలు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. అయితే, అసోం, జమ్మూకశ్మీర్, చండీగఢ్‌లలో నేటి నుంచి 9, 10, 11, 12వ తరగతి విద్యార్థుల కోసం పాఠశాలలు, కళాశాలలను తెరిచారు. అసోంలో విద్యార్థులు మళ్లీ ఈ రోజు తొలిసారి పాఠశాలు, కళాశాలలకు వెళ్లారు. దాదాపు ఆరు నెలల అనంతరం విద్యా సంస్థలు తెరుచుకోవడంతో అక్కడి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలను తెరుస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు.
కరోనా నిబంధనలను పాటిస్తూ తరగతి గదుల్లో కూర్చొని చదువుకుంటామని చెప్పారు. ఇప్పటికే అసోంలోనూ ప్రైవేటు పాఠశాలలు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నప్పటికీ పేద విద్యార్థులు వాటికి దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైస్కూల్ విద్యార్థులకు విద్యా సంస్థల్లోనే తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసోంలోనే కాకుండా చండీగఢ్, జమ్మూకశ్మీర్లోనూ హైస్కూల్ విద్యార్థుల కోసం పాఠశాలలు తెరిచారు. అయితే, కరోనాకు భయపడకుండా బడులకు రావాలనుకున్న వారే రావాలని, పాఠాల్లో ఉన్న అనుమానాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. బడులను మళ్లీ తెరుస్తోన్న నేపథ్యంలో అక్కడి పరిసరాలన్నింటినీ శుభ్రం చేశామని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తున్నామని ఉపాధ్యాయులు తెలిపారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/