‘పెగాసస్’ వ్య‌వ‌హారంపై వచ్చేవారం ఉత్తర్వులు

సాంకేతిక నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామన్న సీజేఐ

న్యూఢిల్లీ : పెగాసస్ నిఘాకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు నిపుణులతో కూడిన సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఇవాళ ఓపెన్ కోర్ట్ విచారణ (సామాన్యులూ విచారణను ప్రత్యక్షంగా చూసేందుకు అవకాశం) సందర్భంగా సీనియర్ అడ్వొకేట్ సీయూ సింగ్ కు ఈ విషయాన్ని చెప్పారు. వచ్చే వారం కమిటీ ఏర్పాటుపై అధికారిక ఆదేశాలను జారీ చేస్తామని స్పష్టం చేశారు.

అయితే, కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కొందరు సభ్యులు కమిటీలో భాగమయ్యేందుకు ఆసక్తి చూపడం లేదని, అందుకే కమిటీ ఏర్పాటు ఆలస్యమవుతోందని సీజేఐ పేర్కొన్నారు. వచ్చే వారం నాటికి సభ్యుల నియామకాన్ని ఖరారు చేస్తామన్నారు. కాగా, దేశంలో 300 మంది రాజకీయ నాయకులు, పౌర హక్కుల కార్యకర్తలు, ఇతర నిపుణులపై పెగాసస్ ద్వారా నిఘా పెట్టారంటూ అంతర్జాతీయ మీడియా కన్సార్టియం వెల్లడించిన సంగతి తెలిసిందే.

దీనిపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సాంకేతిక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గత వారం కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా.. సుప్రీంకోర్టు మాత్రం తిరస్కరించింది. పెగాసస్ తో నిఘా పెట్టారా? లేదా? అన్నది మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలనుకుంటున్నామని స్పష్టం చేసింది. ఒకవేళ నిఘా పెడితే చట్టబద్ధంగానే చేశారా? అనే విషయంపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే, దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని దీనిపై సవివర అఫిడవిట్ ను దాఖలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం తన నిరాసక్తతను వ్యక్తం చేసింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/