మోడీపై బీబీసీ డ్యాక్యుమెంటరీ.. ఫిబ్రవరి 6న సుప్రీం విచారణ

'Supreme' notices to CSs of AP and Bihar states
supreme-court

న్యూఢిల్లీః ప్ర‌ధాని మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంట‌రీని కేంద్రం బ్యాన్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ నిషేధాన్ని స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎంఎల్ శ‌ర్మ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే ఈ కేసుపై వ‌చ్చే సోమ‌వారం విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు ఈరోజు సుప్రీంకోర్టు తెలిపింది. చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌, జ‌స్టిస్ పీఎస్ న‌ర్సింహా, జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం ఆ పిటిష‌న్‌ను ప‌రిశీలించింది. 2002లో గుజ‌రాత్‌లో జ‌రిగిన అల్ల‌ర్ల‌లో మోడీ హ‌స్తం ఉన్న‌ట్లు బీబీసీ త‌న డాక్యుమెంట‌రీలో చూపించింది. దీంతో ఆ డాక్యుమెంట‌రీ వివాదాస్ప‌ద‌మైంది.

ఆ డాక్యుమెంట‌రీని యూట్యూబ్‌, ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌రాదు అంటూ ఇటీవ‌ల కేంద్ర స‌ర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు భాగాలు ఉన్న ఆ డాక్యుమెంట‌రీని బ్యాన్ చేయ‌డం రాజ్యాంగ‌ వ్య‌తిరేక‌మ‌ని, ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఎంఎల్ శ‌ర్మ త‌న పిటిష‌న్‌లో ఆరోపించారు. మాజీ జ‌ర్న‌లిస్టు ఎన్ రామ్‌, సామాజిక కార్య‌క‌ర్త ప్రశాంత్ భూష‌ణ్‌, తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీ మ‌హువా మోయిత్రాలు కూడా ఈ అంశంపై పిటిష‌న్లు దాఖ‌లు చేశారు. ఆ పిటీష‌న్ల‌ను కూడా ఫిబ్ర‌వ‌రి ఆరో తేదీన విచారించనున్న‌ట్లు సుప్రీం ధ‌ర్మాస‌నం తెలిపింది.