ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలి: మాల మహానాడు

MALA MAHANADU
MALA MAHANADU

సైఫాబాద్‌: దేశంలోని కోట్ల మంది ఎస్సీ,ఎస్టీల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎస్సీ,ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టుపైన సామాజిక ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని మాల మహానాడు జాతీయ గౌరవ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణస్వరూప్‌ పిలుపునిచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయడానికి అగ్రకుల పార్టీలు, న్యాయస్ధానాలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆదివారం ఎఐటియుసి భవన్‌లో దళిత బహుజన పార్టీ, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎస్సీ,ఎస్టీ చట్టం పరిరక్షణ కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించాలని, పోరాటాలకు దళితులు నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ చట్టం పరిరక్షణ కోసం ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని, వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి దళిత బహుజన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చేపూరి రాజు అధ్యక్షత వహించగా, మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా రాజేందర్‌రావు ప్రత్యేక ఆహానితులుగా హాజరైనారు. మాల మహానాడు జాతీయ సలహాదారు డా.వి.ఎల్‌.రాజు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎస్సీ,ఎస్టీ చట్టంపై తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదకను పంపాలని డిమాండ్‌ చేశారు. ఈ చట్టంపై ఎస్సీ,ఎస్టీ ప్రజా ప్రతినిధుల నోరు మెదపకపోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో 131 మంది ఎస్సీ,ఎస్టీ సభ్యులు ఉన్నప్పటికి ఈ చట్టంపై మాట్లాడకుండా అగ్రకుల పార్టీలకు తోత్తులుగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ అశయాలకు వ్యతిరేకంగా ఎస్సీ,ఎస్టీ ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మాల మహానాడు జాతీయ కార్యనిర్వహక అధ్యక్షుడు రవీంద్రనాధ్‌ఠాగూర్‌, కార్యదర్శి సంకు శ్రీనివాసులు, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వినమల మంజుల మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ చట్టం పరిరక్షణ కోసం గ్రామ స్ధాయి నుంచి ఉద్యమం చేపట్టవలసిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో నాయకులు గౌతం ప్రసాద్‌, కోప్పెల్లి రమేష్‌, తుంగా బాబురావు తదితరులు పాల్గొన్నారు.