ఆ హక్కు ఏ రాష్ట్రానికీ లేదు ..సుప్రీంకోర్టు

ప్రభుత్వాధికారిని ఎన్నికల కమిషనర్​ గా నియమించడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమే

న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ఎప్పుడైనా స్వతంత్రంగానే ఉండాలని, దాని బాధ్యతలను ఓ ప్రభుత్వాధికారికి అప్పగించడమంటే ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయడమేనని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ప్రభుత్వ అధికారికి అదనపు బాధ్యతలను అప్పగించడం రాజ్యాంగాన్ని విస్మరించడమేనని పేర్కొంది. గోవా ఎన్నికల సంఘం విషయంలో దాఖలైన వ్యాజ్యాన్ని శుక్రవారం జస్టిస్ రోహిన్టన్ ఫాలీ నారీమన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్లు స్వతంత్ర వ్యక్తులు అయి ఉండాలని తేల్చి చెప్పింది. తమకు ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వాధికారులను నియమించుకునే హక్కు ఏ రాష్ట్రానికీ లేదని చెప్పింది. కానీ, గోవాలో ఇలానే ఓ అధికారిని నియమించడం షాక్ కు గురి చేసిందని వ్యాఖ్యానించింది. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పునూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు.

మార్గావ్, మార్ముగావ్, మపూసా, సాంగ్వెమ్, క్వెపెమ్ మున్సిపాలిటీల ఎన్నికలకు పట్టాణాభివృద్ధి శాఖ ఇచ్చిన నోటిఫికేషన్ ను పక్కనపెట్టాల్సిందిగా మార్చి 1న గోవా హైకోర్టు ఆదేశించింది. ఆ తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమితులైన ఓ ప్రభుత్వాధికారి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/