పోలింగ్ స‌మ‌యంపై దాఖ‌లైన పిటిష‌న్ కొట్టివేత‌

supreem court
supreem court

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడతలో పోలింగ్‌ సమయాన్ని ముందుకు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విపరీతమైన ఎండతో పాటు రంజాన్‌ మాసాన్ని దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ ప్రారంభ సమయాన్ని ఉదయం 7 గంటల నుంచి ఉదయం 5.30 గంటలకు మార్చాలంటూ న్యాయవాది మహ్మద్‌ నిజాముద్దిన్ పాషా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం.. పోలింగ్‌ సమయాన్ని మార్చడం కుదరదని స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. కావాలనుకుంటే ప్రజలు ఉదయమే వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అంతేగానీ పోలింగ్‌ సమయాన్ని ముందుకు జరిపితే ఈసీకి సమస్యలు ఎదురవుతాయి’ అని ధర్మాసనం వెల్లడించింది. పోలింగ్‌ సమయాన్ని మార్చాలంటూ పాషా తొలుత ఈసీని కోరారు. అయితే ఇందుకు ఎన్నికల సంఘం నిరాకరించింది. సమయాన్ని మార్చడం ఇప్పుడు సాధ్యం కాదని స్పష్టం చేసింది.

తాజా వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/