ఆ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాల్సిందే..సుప్రీం

ఎంత పరిహారం ఇవ్వగలరో 6 వారాల్లోగా నివేదిక ఇవ్వాలి: సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ : కోవిడ్‌ మృతుల కుటుంబాలకు కనీస నష్ట పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్‌ మృతులకు నష్టపరిహారం చెల్లించే పిటిషన్‌పై బుధవారం జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్ట పరిహారం అన్నది కేంద్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపింది. విపత్తు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్రం తన వాదనలు వినిపించింది. కానీ కేంద్ర ప్రభుత్వ వాదనను కోర్టు తిరస్కరించింది. విపత్తు నిర్వహణ చట్టం సెక్షన్ 12 ప్రకారం పరిహారం ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఎంత న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌న్న దానిపై ఎన్డీఎంఏనే డిసైడ్ చేసుకునేలా కోర్టు తీర్పునిచ్చింది. ఆరు వారాల‌ వ్య‌వ‌ధిలోగా ఆ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించాల‌ని కోర్టు ఆదేశించింది.

కోవిడ్ మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఆరు వారాల్లోగా నిర్ధారించాల్సిందిగా ఎన్‌డీఎంఏను కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. కోవిడ్ కాంప్లికేషన్స్‌తో మృతి చెందిన కేసుల్లోనూ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు మార్గదర్శకాలను సులభతరం చేయాలని కూడా సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున చెల్లించాలని కోరుతూ దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/