తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రిబాయి ఫూలే

నేడు వర్ధంతి

Savitribai Phule (File Pic)
Savitribai Phule (File Pic)

తొమ్మిదోవ శతాబ్దపు నాటి సంకెళ్లను తెంచి సమాజంలో దళితులకు, మహిళలకు, వితంతువ్ఞలకు, బాలికలకు విద్య, గౌరవాన్ని సాధించిన మహిళ ఆమె. సావిత్రీభాయిని భారతీయ మొదటి తరం స్త్రీవాదిగా వర్ణిస్తారు.

విద్య ద్వారా మహిళల్లో సామాజిక చైతన్యంతోపాటు, నిరక్షరాస్యులైన వయోజన స్త్రీలను ఇంటింటికి తిరిగి పాఠశాలకు తీసుకువెళ్లి విద్యాబుద్ధులు నేర్పించిన సంస్కర్త సావ్రితిబాయి జనవరి మూడున మహారాష్ట్రలోని సతార జిల్లాలో ఖండాల తాలూకాలోని నైగాన్‌ అనే కుగ్రామంలో కండోజీపాటిల్‌, లక్ష్మిబాయిలకు మొదటి సంతానంగా మాలి వెనుకబడిన కులంలో 1831లో జన్మించారు. 1840లో మహాత్మా జ్యోతిరావ్ఞఫూలేతో వివాహం జరిగింది.

భర్త వద్దే విద్యాభ్యాసం బోధనా పద్ధతులు, మెలకువలు తెలుసుకుని ప్రాథమిక పాఠశాలను పూణెలో జనవరి1, 1848లో స్థాపిం చారు. అనేక ప్రతికూల పరిస్థితుల్లో అదే సంవత్సరం ఆమె మరొక పాఠశాలను ప్రారంభించారు. 1851 నాటికి ఆమె 150 మంది అమ్మాయిలతో మూడవ పాఠశాల ప్రారంభించారు. మహిళా కార్మిక యూనియన్‌ స్థాపించారు.

మహిళలను పశువ్ఞ కంటే హీనంగా చూసే ఆ రోజుల్లో సావిత్రిబాయి తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయుని అయ్యారు. మహిళలను విద్యావంతు లుగా చేయడంతోపాటు సావిత్రిబాయి యువ వితంతువ్ఞల, బలాత్కరింపబడిన వితంతువ్ఞల శ్రేయస్సుకోసం కూడా పనిచేశారు. సావిత్రిబాయి మహిళల విషయంలో ఒక విద్యాసంస్కర్తగా, సంఘసంస్కర్తగా పనిచేశారు. 19వ శతాబ్దంలో బాల్య వివాహాలు ఎక్కువ.

వితంతువ్ఞల తలలకు క్షౌరం ఆపాలని ఆమె సమ్మెలు నిర్వహించారు. ఆ కాలంలో నిస్సహాయులైన మహిళలపైన వితంతువ్ఞలపైన బలాత్కారాలు ఎక్కువగా జరిగేవి. ఆ కారణంగా గర్భవతులైన వితంతువ్ఞలు ఆత్మహత్యలకు పాల్పడ కుండా,నవజాత శిశువ్ఞలను చంపకుండా పిల్లల సంరక్షణా గృహం బాలహత్య ప్రతిబంధక గృహాలను ఏర్పాటు చేశారు. సత్యశోధన సమాజాన్ని 1873 సెప్టెంబరు 23న ఆవిష్కరించారు.

డిసెంబరు 25న మొదటి వివాహాన్ని సమాజం పద్ధతిలో జరిపించి, ఆదర్శవంతంగా ముందుకు తీసుకువెళ్లారు. తన దత్తత కుమారుడు యశ్వంత్‌ వివాహం కూడా సమాజం పద్ధతిలో పూజారులు లేకుండా కట్నకానుకలు లేకుండా ఆదర్శవంతంగా చేసి చూపించారు సావిత్రిబాయి. ఫూలే దంపతులు సంఘం కోసమే ఎప్పుడూ పనిచేశారు. 1877లో తమ ప్రాంతంలో తీవ్రమైన కరవ్ఞ వచ్చింది. ఈ జంట విక్టోరియా బాలాశ్రమం పేరుతో ప్రతిరోజూ వెయ్యి మందికి అన్నదానం నిర్వహించేవారు.

1890లో జ్యోతిరావ్ఞ ఫూలే అంత్యక్రియల ఊరేగింపులో సావిత్రిబాయి మరో నిషేధాన్ని అధిగమించింది. నేటికీ కూడా హిందూమతంలో కర్మలు పురుషులు మాత్రమే చేస్తూ వస్తుండగా ఆనాడే దానికి విరుద్ధంగా సావిత్రిబాయి ఆచారాలను ఎండగడుతూ సంప్రదాయాలను సంస్కరిస్తూ అంత్యక్రియలకు మట్టికుండ పట్టి ఊరేగింపులో నడిచింది.

మృత్యుభయం కూడా సావిత్రిబాయి ధైర్యాన్ని అడ్డుకోలేకపోయింది. 1897లో పూణెలో ప్లేగు వ్యాధి ప్రబలింది. కానీ ఆమె ముందంజ వేసింది. ఇలాంటి సమయంలో తక్కువ కులాల వారికి సహాయపడాలని వెళ్లింది. ప్లేగువ్యాధి సోకిన పాండురంగ బాబాజీ గైక్వాడ్‌ అనే పదేళ్ల బాలుడిని ఆస్పత్రిలో చేర్పించి కాపాడింది.

ఆ సమయంలో ఆ మహమ్మారి ప్లేగు అంటు వ్యాధి ఆమెను కూడా కబళించింది. ఆమె ప్లేగు వ్యాధి సోకి తన ఆదర్శప్రాయమైన జీవనయానాన్ని 1897 మార్చి10న ముగించింది. ఆంగ్లేయుల పరిపాలనలో తొలి భారతీయ మహిళా ఉపాధ్యాయురాలిగా వినుతికెక్కింది.

– డా.జె.వి ప్రమోద్‌కుమార్‌

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/