ఏడు దేశాలపై రాకపోకలు నిషేధం : సౌదీ అరేబియా

రియాద్‌: ఆఫిక్రా దేశాల్లో కరోనా కొత్త బీ.1.1.5.2.9 వేరియంట్‌ కలకలం సృష్టిస్తున్నది. ఇది అత్యంగా వేగంగా వ్యాప్తిచెందుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా వైరస్‌ ప్రభావం అత్యధికంగా ఉన్న ఏడు దేశాలకు సౌదీ అరేబియా రాకపోకలు నిషేధించింది. ఇందులో దక్షిణాఫ్రికా, జింబాంబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్‌, లెసోథో, ఎస్వతినీ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పర్యాటకులకు సౌదీకి అనుమతిలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఇతర దేశాల్లో 14 రోజులు ఉన్న తర్వాత, సౌదీ ఆరోగ్య నియమాలు పాటిస్తే వారికి తమ దేశంలోకి అనుమతిస్తామని చెప్పారు. ఇది సోమవారం నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.

ఇప్పటికే ఈ ఏడు దేశాల ప్రయాణికులపై జోర్డాన్‌ కూడా నిషేధం విధించింది. జోర్డాన్‌కు చెందినవారు కాకుండా ఈ దేశాలకు చెందినవారికి అనుమతిలేదని స్పష్టం చేసింది. కాగా, ఈ కొత్తరకం బీ.1.1.5.2.9 వేరియంట్‌కు డబ్ల్యూహెచ్‌వో ఒమిక్రాన్‌గా నామకరణం చేసింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ కన్సర్న్‌’గా ప్రకటించింది.

కాగా, గత కొన్ని రోజులుగా దక్షిణాఫ్రికాలో రోజూవారీ సగటు కేసులు 200కుపైగా నమోదవుతున్నాయి. అయితే, గత బుధవారం ఒక్కరోజునే 1,200 కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు దానికి రెట్టింపు అంటే 2,465 కేసులు రికార్డయ్యాయి. మరణాలు కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలో వారు కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అదే ‘బీ.1.1.529’. దక్షిణాఫ్రికా దేశం బోట్స్‌వానాలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న హెచ్‌ఐవీ రోగిలో ఈ వేరియంట్‌ ఉత్పన్నమై ఉండొచ్చని యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌లోని జెనటిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ ఫ్రాన్‌కోసిస్‌ బాలౌక్స్‌ అభిప్రాయపడ్డారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/