సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం

సైన్యంలోకి మహిళలకు అవకాశమిచ్చిన సౌదీ అరేబియా

రియాద్‌: సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో మహిళలను చేర్చుకునేందుకు సౌదీ యువరాజు గ్రీన్‌‌ సిగ్నల్‌ ఇచ్చారు. సౌదీ అరేబియా నిర్ణయం పట్ల అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు రెండేండ్ల పాటు చర్చలు జరిపిన తరువాత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు తుది ఆమోదం తెలిపింది. ప్రారంభంలో నాలుగు పోస్టుల్లో మాత్రమే మహిళల నియామకానికి దరఖాస్తులు ఆమోదించనున్నారు. సైన్యానికి ఎంపికైన మహిళలు ప్రస్తుతం నగరాల్లో మాత్రమే మోహరించబడతారని, వారిని యుద్ధభూమికి దూరంగా ఉంచనున్నట్లు కూడా స్పష్టం చేశారు.

రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఏకీకృత ప్రవేశ పోర్టల్‌ను ప్రారంభించింది. మొదటిసారిగా పురుషులతో పాటు మహిళల దరఖాస్తులను కూడా ఆమోదిస్తున్నారు. ప్రస్తుతం, సైనిక్ నుంచి సార్జెంట్ వరకు మొత్తం నాలుగు పోస్టులకు మాత్రమే మహిళలు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. రాయల్ సౌదీ అరేబియా ఆర్మీ, రాయల్ సౌదీ వైమానిక దళం, రాయల్ సౌదీ నేవీ, రాయల్ సౌదీ స్ట్రాటజిక్ మిస్సైల్ ఫోర్స్, రాయల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ కోసం మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో మహిళలను తీసుకోవాలని చారిత్రక నిర్ణయం తీసుకోవడం పట్ల సౌదీ యువరాజు ప్రిన్స్ సల్మాన్‌ను అక్కడి మహిళలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఈ విషయం 30 ఏండ్లగా చర్చిస్తున్నారు, కానీ ఈ రోజు ప్రిన్స్ సల్మాన్ నిర్ణయంతో సైన్యంలో మహిళలు కూడా సేవలందించేందుకు అవకాశం లభించిందని ఆపరేటింగ్ సిస్టమ్ స్పెషలిస్ట్ హలా అల్ యాన్బావి చెప్పారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/