శనగకుంట అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

గురువారం సాయంత్రం ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈదురుగాలుల‌కు మంట‌లు వ్యాపించి ఓ ఊరును బూడిద చేసాయి. మంగపేట మండలం నరసింహసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని శనగ కుంటలో ఈదురుగాలుల వ‌ల్ల అట‌వీప్రాంతంనుంచి మంట‌లు గ్రామానికి వ్యాపించాయి. దీంతో గ్రామంలోని 40 ఇళ్లు కాలిబూడిద‌య్యాయి. దీంతో గిరిజనులు రోడ్డున పడ్డారు. ఈ క్రమంలో బాధితులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదివారం పరామర్శించారు. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్యతో కలిసి కాలిపోయిన ఇండ్లను పరిశీలించి బాధిత కుటుంబాలకు మనో ధైర్యం చెప్పి..అక్కడి ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన రైతులకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్ కార్డులు, విద్యార్థులకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్లు వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి అగ్నిప్రమాద బాధితులకు డబుల్ బెడ్ రూములు మంజూరు చేయిస్తానని, వాటికి సంబంధించిన జీఓలతో తిరిగి మళ్లీ శనిగకుంట వస్తానని బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు.