అగ్నిమాపక సేవల్లో సాత్విక..

జీవన వికాసం

Satvika
Satvika

ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే వెంటనే ఫైర్‌ ఇంజన్ల కేంద్రాలకు సమాచారం అందిస్తారు. వీటినే ఫైర్‌స్టేషన్లని కూడా అంటారు.

జీవితాంతం చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని కళ్లముందే బూడిదగా మార్చేస్తుంది నిప్పు. అందుకే అగ్గి అంటే అందరికీ భయం. మంటలకు దూరంగా ఉంటారు.

ఇలాంటి కష్టసమయాల్లో సాత్విక ఆపద్బాంధవురాలి పాత్ర పోషిస్తోంది. నిప్పుతో పోరాటం చేస్తూ ఆస్తి, ప్రాణ నష్టాలు కాకుండా కాపాడుతోంది.

పదహారేళ్ల దాకా సాత్వికకూ అందరిలాగే నిప్పు అంటే భయం. దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటానని ఎప్పుడూ అనుకోలేదామె.

తండ్రి మంటలు అర్పడంలో నిపుణుడు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగంలో అగ్నిమాపక సేవలందించే సాత్విక ఫైర్‌ సర్వీసెస్‌ ప్రారంభించారు.

ఖాళీగా ఉన్నప్పుడు తండ్రితోపాటు వెళ్లేది. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా మంటల్ని ఎలా అదుపులోకి తెస్తున్నారో చూసి మెలకువలు పట్టేసేది.

ఈ సర్వీసు జనాలకు ఎంతో మేలు చేస్తుందని భావించాక దీన్నే కెరీర్‌గా ఎంచుకోవాలను కుంది.

Satvika- In the fire service
Satvika- In the fire service

బ్రిటన్‌లోని ఓ శిక్షణా సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ముంబయిలోని ఓఎస్‌హెచ్‌ఎలో కోర్సులో చేరింది. భవనాల నిర్మాణ లోపాలు, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ చర్యలు..

వీటన్నింటిపై పట్టు సాధిం చింది. కోర్సు అయిపోగానే పూర్తిస్థాయిలో రంగంలోకి దిగింది సాత్విక. అగ్నిప్రమాదాలపై అవగాహన కలిగించేలా శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.

సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ప్రభుత్వ కార్యాలయాలు, మాల్స్‌, స్టార్‌ హోటళ్లు, విద్యాసంస్థలు, బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్‌, గేటెడ్‌ కమ్యూనిటీల్లో జనాలకు శిక్షణనిస్తోంది.

ముందు జాగ్రత్తలు, జరిగితే తక్షణం స్పందించాల్సిన తీరు, ప్రమాదాన్ని ముందే పసిగట్టే యంత్రాల వాడకం, అదుపు చేసే పరికరాల వినియోగం తదితర అంశాల్లో తన సిబ్బందితో కలిసి క్లాసులు చెబుతోంది.

ఈమధ్యే శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోనూ సిబ్బందికి ఫైర్‌ ఇంజన్‌ సేఫ్టీపైన శిక్షణనిచ్చింది.

ఇండియాతోపాటు విదేశాల్లోనూ కలిపి ఇప్పటికి 500 వరకు శిక్షణ తరగతులు నిర్వహించింది.

గతేడాది నాంపల్లి నుమాయిష్‌లో అగ్నిప్రమాదం జరగడంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వం ఈసారి ప్రదర్శనకు సాత్వికను భద్రతా ఏర్పాట్లు చూడమని కోరింది.

దాంతో 1,500 స్టాళ్ల యజమానులకు మంటల నుంచి రక్షణ పొందడం, అగ్నిమాపక పరికరాల వాడకం గురించి వివరించింది.

చిన్న ప్రమాదం లేకుండా ప్రదర్శన ముగియడంతో ఆమె కృషిని ప్రశంసిస్తూప్రభుత్వం సత్కరించింది. ఇదే ఉత్సాహంతో తను సేఫ్‌జోన్‌ తెలంగాణ పేరుతో ఒక కార్యక్రమానికి రూపకల్పన చేసింది.

స్థానిక నాయకులు, ప్రభుత్వ సహకారంతో రాష్ట్రమంతా తిరుగుతూ భద్రత అవగాహన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణకు తనవంతు కృషి చేస్తానంటోంది సాత్విక.

ఈ రంగంలోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ముందు ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సుచేశా.

అమ్మాయిలు సుకుమారమైన వృత్తులే ఎంచుకోవాలా? సాహసోపేతమైన, సామాజిక ప్రయోజనం ఉన్న పనులు చేయలేరా? అని ఓసారి ఆలోచించా.

అగ్నిమాపక సేవల్లో మహిళల గురించి వెతికితే దేశమంతా కలిపి తమిళనాడులో ఒక్కరే ఉన్నారని తెలిసింది. నాలో పట్టుదల పెరిగింది.

ఛాలెంజింగ్‌గా ఇటువైపు వచ్చాను అంటారు సాత్విక.

అగ్నిప్రమాదాల్ని అరికట్టడమూ ఒక కళేనని సాత్విక చేస్తున్న సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ప్రశంసాపత్రంతో సత్కరించింది.

ఆరోగ్యశాఖ భద్రతా శిక్షణ అధికారిగా, సేఫ్టీ కన్సల్టెంట్‌గా, రిస్క్‌ అసెస్మెంట్‌ ఆడిటర్‌గా, ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌గా బహుముఖపత్రంతో పోషిస్తోంది.

లండన్‌లోని మిడిల్‌సెక్స్‌ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ ఇన్‌ ఆక్యుపేషనల్‌ సేఫ్టీ అండ్‌ హెల్త్‌, ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌జంట్‌ పూర్తి చేసింది.

ఫైర్‌సేప్టీలో లెవెల్‌ 1 నుంచి లెవెల్‌ 7 వరకు పూర్తి చేసిన తొలి ఆసియా అమ్మాయిగా నిలిచింది.

కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం నుంచి ఫైర్‌ సేఫ్టీ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తిచేసిన ఒకే ఒక భారతీయ అమ్మాయి సాత్విక.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/