సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ముందుకు సాగుతా – పవన్

మాట తప్పని… మడమ తిప్పని మహానేత శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ముందుకు సాగుతానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు పవన్ కళ్యాణ్.

పటేల్ ధృడచిత్తం కారణంగానే సంపూర్ణ భారత్ ఆవిష్కృతం అయిందని చెప్పడం అతిశయోక్తి కాదు. సత్యం..ధర్మం.. ఆడిన మాట తప్పకపోవడం ఆయన నాయకత్వాన్ని ద్విగుణీకృతం చేశాయి. నిజాం రాజ్యంతోపాటు 555 సంస్థానాలు ఇండియన్ యూనియన్లో సమ్మిళితమవడానికి శ్రీ పటేల్ ఉక్కు సంకల్పమే మూలమన్నారు.

గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన శ్రీ పటేల్ లండన్ లో న్యాయవాద విద్యను అభ్యసించి తిరుగులేని న్యాయవాదిగా పేరుగాంచారు. అంతటితో ఆగక దేశ స్వాతంత్ర్యమే ధ్యేయంగా ఉద్యమ కాలంలో వీరోచిత పోరాటం చేశారు. స్వతంత్ర భారతావనికి హోమ్ మంత్రిగా, ఉపప్రధానిగా ఆయన అందించిన సేవలు నిరూపమానమైనవి అన్నారు. నిజాం రాజ్యంపై ఆయన సైనిక చర్య చేపట్టకపోయినట్లయితే ఎంతో మంది అమాయకులు రజాకార్ల దాష్టీకాలకు బలైపోవడమే కాక సంపూర్ణ భారతదేశ ఆవిర్భావం మరింత ఆలస్యమై ఉండేది. చట్ట సభలలోగాని, చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధులు “ఇచ్చిన మాట” ను తప్పకూడదని శ్రీ పటేల్ విశ్వసించడం ఆయనకు చట్ట సభల పట్ల ఉన్న గౌరవాన్ని తెలియచేస్తుందని అన్నారు.

ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ శ్రీ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా నా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానని మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఆయనకు ప్రణామాలు అర్పిస్తున్నానని ప్రెస్ నోట్ లో వెల్లడించారు.