సర్దార్ 2 టీజర్ వచ్చేసింది

కోలీవుడ్ హీరో కార్తీ నటించిన తాజా చిత్రం సర్దార్. అక్టోబర్ 23 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తెలుగు లోను సూపర్ హిట్ సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ సర్దార్ 2 ను ప్రకటించి అభిమానుల్లో సంతోషం నింపారు. అభిమన్యుడు ఫేమ్ పి.ఎస్.మిత్రన్ సర్దార్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రతి పాత్రను దర్శకుడు తెరకెక్కించిన తీరు.. ముఖ్యంగా హీరో కార్తి నటన ప్రేక్షకులను కట్టిపడేసింది. కమర్షియల్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఈ మూవీలో ఉండటంతో మూవీ అందరికీ కనెక్ట్ అయ్యింది.

సర్దార్ పార్ట్ 2 అనౌన్స్‌మెంట్‌ని టీజర్‌తో చేశారు. ‘ఒక్కసారి గూఢచారి అయితే.. ఎల్లప్పుడూ గూఢచారే’ అనే ట్యాగ్ లైన్ తో ‘సర్దార్ 2’ కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియోని మేకర్స్ ఆవిష్కరించారు. ఇందులో విజయ్ ప్రకాష్ (కార్తీ) పోలీసు ఫోర్స్ నుండి తొలగించగా.. అతన్ని RAW ఏజెన్సీలో స్పై ఏజెంట్ గా చేరమని ఆఫర్ చేస్తారు. దీనికి అతను అంగీకారం తెలపడంతో కంబోడియాలో మొదటి మిషన్ కోసం రెడీగా ఉండమని అధికారి ఆదేశిస్తారు.

పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్’ చిత్రాన్ని నిర్మించిన ప్రిన్స్ పిక్చర్స్ ఎస్ లక్ష్మణ్ కుమార్ ఈ సీక్వెల్ ని కూడా రూపొందించనున్నారు. మొదటి భాగంలో భాగమైన నటీనటులు సాంకేతిక నిపుణుల బృందం ఈ సీక్వెల్ కోసం వర్క్ చేయనున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.