ఉల్లిగడ్డలు తినడంతో అమెరికాలో సాల్మొనెల్లా వ్యాప్తి

వాషింగ్ట‌న్ : ఓ వైపు కరోనాతో వణుకుతున్న అమెరికాలో సాల్మొనెల్లోసిస్ అనే వ్యాధి వెలుగులోకి వచ్చింది. దీంతో అగ్రరాజ్యంలోని ప్రజలు వణికిపోతున్నారు. ఈ వ్యాధికి కారణం వంటింట్లో ఉండే ఎర్ర ఉల్లిపాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వలన ఈ వ్యాధి వ్యాపిస్తున్నట్లు ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు. సాల్మొనెల్లోసిస్ వ్యాప్తికి ఉల్లిపాయలే కారణం అంటూ సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ అంటూ ప్రకటించింది. అమెరికాలో సెప్టెంబర్ లోనే వెలుగులోకి వచ్చిన సాల్మొనెల్లా కేసులు అక్టోబర్ 18 తేదీనాటికి 37 రాష్ట్రాలకు వ్యాపించింది. ఇప్పటి వరకూ 652 మందికి ఈ బ్యాక్టిరియా సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. టెక్సాస్‌లో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మేరీల్యాండ్‌లో 58, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది.

ఇప్పటివరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ తెలిపింది. ఈ వ్యాధి మరింత విస్తరించి .. మహామ్మరిగా మారే అవకాశం ఉందని CDC హెచ్చరించింది. ఆగష్టు నెలాఖరులో మెక్సికో, చిహువా నుంచి అమెరికాలోని ప్రోసోర్స్ అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుంది. ఈ ఉల్లిపాయలను దేశంలోని పలు రెస్టారెంట్లు, కిరాణా షాపులకు పంపిణీ చేసింది. ఆ ఉల్లిపాయాలను ఇళ్లల్లో, రెస్టారెంట్లలో వినియోగించారు. ఇప్పుడు అమెరికాలో ఈ వ్యాధి వ్యాప్తికి ఈ ఉల్లిపాయలనే కారణమని అధికారులు నిర్ధారణకు వచ్చారు. దీంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.. అంతేకాదు అమెరికాలోని ప్రజలు మూడు నెలలు క్రితం నుంచి నిల్వ ఉన్న ఉల్లిపాయలను వినియోగించరాదని ప్రకటించారు. అయితే ఉల్లి పాయలు ఏ దేశం నుంచి వచ్చాయో తెలియదు.. ఎందుకంటే మెక్సికో నుంచి వచ్చినట్లు ఎటువంటి స్టిక్కర్ ఉండదు కనుక ప్రోసోర్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలు ఏమైనా ఉంటే వెంటనే బయట పడేయాలని సీడీసీ చెప్పింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/