ఇక ఫై ఆర్టీసీ బస్సుల ఫై అశ్లీల చిత్రాల పోస్టర్లు కనిపించవు – సజ్జనార్

టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ తన మార్క్ చూపెట్టడం మొదలుపెట్టారు. ఇటీవల ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఆయన సంస్థ పురోగతికి ఎన్నో సంచలనాత్మక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా బస్సుల ఫై అశ్లీల చిత్రాల పోస్టర్ల ఫై కీలక నిర్ణయం తీసుకున్నారు. సిటీ బస్సులపై ఓ సినిమాకు సంబంధించిన అశ్లీల పోస్టర్‌ చిత్రాలను బుధవారం ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ సంస్థ అయిన ఆర్టీసీ ఆదాయం కోసం ఇలాంటి చెత్త ప్రకటనలు బస్సులపై వేయడం సరికాదని నెటిజన్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ సజ్జనార్ దృష్టికి వెళ్లడం తో దీనిపై సంస్థ చర్యలు తీసుకుంటుందని.. భవిష్యత్తులో ఆర్టీసీ బస్సులపై అశ్లీల పోస్టర్లు కనిపించకుండా చర్యలు తీసుకుంటామని ఆయన రీట్వీట్ చేశారు. ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి సజ్జనార్‌ సమాధానం ఇవ్వడంపై నెటిజన్లు ఆయన్ని ప్రశంసిస్తున్నారు.

అలాగే గురువారం హైదరాబాద్‌లో ఆకస్మిక పర్యటనలు చేస్తూ సిబ్బందికి చెమటలు పట్టించారు సజ్జనార్. ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు సక్రమంగా పాటిస్తున్నారా? లేదా?, ఆర్టీసీ ప్రయాణంపై ప్రయాణికుల స్పందనేంటి?… ఇలాంటి విషయాలు స్వయంగా తెలుసుకున్నారు. లక్డీకాపూల్‌ బాస్ స్టాప్ లో సామాన్య ప్రయాణికుడిలా నిల్చుని గండిమైసమ్మ నుంచి సీబీఎస్‌ మీదుగా అఫ్జల్‌గంజ్‌ వెళ్లే బస్సు ఎక్కారు. ఆయన్ని ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌ గమనించలేదు. ప్రయాణికులతో కలిసిపోయిన సజ్జనార్ సిటీ బస్సుల సేవలపై ఆరా తీశారు. CBS లో బస్ దిగి బస్టాండ్ ఆవరణ తిరిగిన సజ్జనార్… మరుగుదొడ్లను పరిశీలించి దుర్వాసన రాకుండా చూడాలన్నారు. మొత్తం మీద సజ్జనార్ అధికారులకు , కార్మికులకు చెమటలు పట్టిస్తూ తన పనితనం చూపిస్తున్నారు.