ఉద్యోగులు ఎప్పుడూ సీఎం జట్టులో సభ్యులే: సజ్జల
జీతాలు ఆలస్యం కావడం వాస్తవమేనని అంగీకారం.. సజ్జల
sajjala ramakrishna reddy
అమరావతి: ఉద్యోగుల వేతనాలు, ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు. పీఆర్సీ అమలు, కరవు భత్యాల బకాయిల అంశంపై ఉద్యోగ సంఘాలతో చర్చలు ముగిసిన అనంతరం సజ్జల మాట్లాడుతూ.. కరోనా సంక్షోభం కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. జీతాలు ఆలస్యం అవడం ఇబ్బందికరమేనని, అయితే సీఎం జగన్ ఉద్యోగుల భద్రత విషయంలో ఎప్పుడూ ముందుంటారని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో సీఎం జగన్ ఎప్పుడూ అలసత్వం వహించలేదని పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాలు అడగకముందే ప్రభుత్వం ఐఆర్ ఇచ్చిన విషయాన్ని సజ్జల ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ నెలాఖరుకు పీఆర్సీ సమస్య పరిష్కారం అవుతుందని, నవంబరు చివరినాటికి ఉద్యోగుల ఇతర సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని వివరించారు. ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదని, ప్రభుత్వ పథకాల అమలు బాధ్యత ఉద్యోగులపైనే ఉందని అన్నారు. జగన్ సీఎం బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వంలో ఉద్యోగులకు ప్రాధాన్యత పెరిగిందని పేర్కొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/