పవన్ , చంద్రబాబుల ఫై సజ్జల ఘాటైన విమర్శలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై వైస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేసారు. జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు పవన్ ప్రయత్నించారని ఆరోపించారు. విశాఖ పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు. అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు.

పవన్ కల్యాణ్ విశాఖలో చేసిన డ్రామా, ఆ తర్వాత విజయవాడ నోవాటెల్ లో పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్ ను చంద్రబాబు కలవడం జరిగింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అంటూ జగన్ ని వెంటనే కుర్చీ నుంచి దించేయడానికి అన్ని శక్తులు ఏకం కావాలని వారు పిలుపు నివ్వడం, మళ్లీ వాళ్లు వెనక్కి వెళ్లడం చూశాం. తాజాగా వాయిదాల పద్దతిలో ఇప్పటం గ్రామానికి పరామర్శ పేరుతో పవన్ కల్యాణ్, ఆ తర్వాత నారా లోకేష్ పర్యటనలు చూశాం. అంతకు ముందు రోజే చంద్రబాబు నందిగామ పర్యటనలో తనపై రాళ్ల దాడి జరిగిందంటూ ఆరోపణలు చేయడం చూశాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, అందుకు పొత్తులకు సిద్ధమని పవన్ డిక్లరేషన్ ఇవ్వడం, ఆ తర్వాత పొత్తులపై ఇంకా చర్చలే పూర్తి కాలేదని కొద్దిరోజులు, సమస్యలు ఉంటే కలిసి పనిచేస్తామని కొద్దిరోజులు చెప్పుకొచ్చారు.

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి … గేర్ అప్ కావడానికి ప్రతిపక్షాలు ఏకం కావడానికి సన్నాహాలు చేసుకోవడంలో తప్పులేదు. నిజాయితీ, నిబద్ధత ఉంటే చంద్రబాబు , పవన్ కల్యాణ్ … ఏ కారణాల వల్ల తాము కలిసి పోటీ చేయాలనుకుంటున్నారో ప్రకటిస్తే తప్పులేదు. ప్రభుత్వ పనితీరులో లోపాలు ఉంటే వాటిని చెప్పడంలో తప్పులేదు. కానీ వాళ్లు ఇవేమీ చేయడం లేదు. ఏదో ఒక సంఘటన మీదనో, జరిగిన పరిణామాల మీదనో, టీడీపీ, జనసేన విడివిడిగా లోపాలను ఎత్తి చూపేలా ప్రవర్తిస్తున్నాయి. ఎందుకంటే గతంలోనూ వీళ్ళిద్దరూ కలిసి పనిచేసి మోసం చేశారని ప్రజల దృష్టిలో ఉంది కాబట్టి, దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక టెంపో క్రియేట్ చేసి, దాని ద్వారా న్యాయబద్ధంగా మళ్ళీ కలిసి పోటీ చేయాల్సిన అవసరం ఉందని ప్రజల్లో ఒక అభిప్రాయం తెచ్చేందుకే వీరి డ్రామాలు అని సజ్జల అన్నారు.