బిఆర్ఎస్ లో చేరబోతున్న ఈటల సన్నిహితుడు..?

కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిజెపి కి భారీ షాక్ తగలబోతుందా..? హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సన్నిహితుడు, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదా కేశవరెడ్డి బిజెపి కి గుడ్ బై చెప్పి బిఆర్ఎస్ లో చేరబోతున్నారా..? ప్రస్తుతం ఇదే చర్చ గా మారింది. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరినపుడు ఆయనతో పాటు వెళ్లిన సదా కేశవరెడ్డి తాజాగా తిరిగి గులాబీ గూటికి వచ్చేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నట్టు తెలిసింది.

ఈ మేరకు ఆదివారం ముఖ్య నేతలతో సమావేశమైన తర్వాత ఈ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశమున్నదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. వీళ్లే కాదు, కంటోన్మెంట్‌ బోర్డు పరిధిలో కమలం గూటి నుంచి ఇంకా అనేకమంది నేతలు బీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. కేశవరెడ్డి 2008, 2015 కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో రెండవ వార్డు నుంచి వరుసగా ఎన్నికయ్యారు. 2015 నుంచి 2017 వరకు బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆది నుంచి ఆయన ఈటల రాజేందర్‌ వెంటే ఉన్నారు. గతంలో ఈటల టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి మారినపుడు కేశవరెడ్డి కూడా కమలం పార్టీలోకి వెళ్లారు.