అతిభక్తితో భార్య,పిల్లలపై అశ్రద్ధ

SAD
SAD

అతిభక్తితో భార్య,పిల్లలపై అశ్రద్ధ

పతి మహిళ మంచి భర్తకావాలని కోరుకుంటుంది. అయితే అతి మంచితనం ఒక్కోసారి శాపంగా పరిణమిస్తుంది. భయం, భక్తి, వినయం, విధేయత లాంటివి వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి. అవి ఎక్కువ అయితే సమస్యలు ఎక్కువ అవ్ఞతాయి అన్నది నాకు అనుభవమయ్యింది. మంచివాడనుకున్న భర్త అతిభక్తి, ఛాదస్తాలకు తట్టుకోలేక పోతున్నాను. నా బాధ ఎవరికైనా చెపితే అంత మంచి వ్యక్తిని తూలనాడ వద్దు అంటూ నాకే హితవు చెపుతున్నారు. నా సమస్యలు పరిశీలించి నేను మారాలో లేక భర్తను మార్చుకోవాలో చెప్పండి. నా వయస్సు 35 సంవత్సరాలు, నా భర్తకు 40 ఏళ్ళు. మాకు ఇద్దరు పిల్లలు. పదేళ్ళ క్రితం పెళ్ళయింది.మా వారు ఒక వైద్యకళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. మంచి జీతం, సౌకర్యాలు ఉన్నాయి. అయితే భార్యకు కావాల్సిన ప్రేమ, అనురాగం, దాంపత్య సుఖం మాత్రం దొరకడం లేదు. మా పెళ్ళి నాటికే ఆయనకు భక్తి ఎక్కువ. అది మంచిదే కదా అనుకున్నాం. అయితే రాను రాను ఆయన భక్తి ముదిరిపోయింది. పెళైన తొలిరోజుల్లో అప్పుడప్పుడు నాతో సరదాగా ఉండేవారు. ఇద్దరు పిల్లల తరువాత పూర్తిగా నాకు దూరమయ్యారు. ఒకే ఇంటిలో ఉన్న, మంచాలు వేరు.

ఆయన ఒక ఆశ్రమంలో భక్తుడు గా చేరారు. రోజు కాలేజి నుంచి ఇంటికి వచ్చి టీ తాగి ఆశ్రమానికి వెళ్ళిపోతారు. అక్కడ పూజలు, ఇతర కార్యక్రమాలు ముగించుకుని ఇంటికి వస్తారు. ఒక్కోరోజు రాత్రి మూడు గంటల సమయంలో నిద్రలేచి స్నానాలు ముగించుకుని ఆశ్రమానికి వెళ్ళిపోతారు. ఆయన దేవ్ఞనికి పూజచేస్తే నాకెలాంటి బాధలేదు. నేనుకూడ ఆయన మారాలని పలువ్ఞరు దేవ్ఞళ్ళను కొలుస్తున్నాను. అయితే ఆయన పూర్తిగా దాంపత్య జీవితానికి దూరమయ్యారు. ఎప్పుడు భగవంతుని ధ్యాసలోనే ఉంటారు. వచ్చేటపుడు ఏమీతేలేదని, పోయేటప్పుడు ఏదీ వెంటరాదని మూన్నాళ్ళ ముచ్చటైన ఈ సుఖాలు ఎందుకంటూ ప్రశ్నిస్తారు.

మనల్ని సృష్టించిన భగవంతుని సేవలో తరిస్తేనే ముక్తి, మోక్షం ప్రాప్తిస్తాయంటారు. నన్ను కూడ తనతో ఆశ్రమానికి రమ్మంటారు. ఇద్దరం భావబంధాలకు స్వస్తిచెప్పి ఆశ్రమంలో చేరిపోదామని ఒత్తిడి చేస్తున్నారు. నేను కాదన్నా ఇంకొంత కాలం తరువాత తను ఆశ్రమంలో చేరి పోతానంటున్నారు. అలాగే పిల్లలను ఆశ్రమంలో చేర్చే యాలంటారు. మేము మాంసాహారులము, ఆయనను పెళ్లాడిన తరువాత శాకాహారిగా మారిపోయాను. కూరల్లో ఉల్లి, వెల్లుల్లి వేయకూడదని ఆదేశించారు. సాత్విక ఆహారం పేరుతో చప్పిడిమెతుకులు తినాల్సివస్తున్నది. మా పిల్లలు కూడ లోలోపల బాధపడుతున్నారు. ఆయన తత్వం మాకేకాదు మా బంధువుల్లో చాలమందికి ఇబ్బందిగా మారింది.

బిటెక్‌ చదివి ఉద్యోగం చేస్తున్న మా బంధువుల అబ్బాయిని నెమ్మదిగా తన వెంట తిప్పుకుని అతన్ని భక్తునిగా మార్చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఉద్యోగం మానేసి ఆశ్రమంలో చేరిపోయాడు. పెళ్లి కూడ వద్దంటున్నాడు. అతను తల్లితండ్రులకు ఒకడే కొడుకు. ఉన్న ఒక పుత్రుడు ఇలా మారిపోవడంతో అతని తల్లి తండ్రులు కన్నీరు మున్నీరవ్ఞతున్నారు. వారం క్రితం మా బంధువ్ఞలంతా ఇంటికి వచ్చి ఆయనను నిలదీశారు. బూతులు తిట్టి కొట్టేంత పనిచేసివెళ్ళారు. దానికి ఆయన ఏమాత్రం బాధపడలేదు. మా బంధువ్ఞలంతా అజ్ఞానులని దేవ్ఞని జాడతెలియని మూర్ఖులని, త్వరలో మారుతారని వేదాంతం చెప్పారు. ఆయనతో వేగలేక నేను కుంగిపోతున్నాను. చాలారోజుల నుంచి సరిగా నిద్ర పట్టడం లేదు. భోజనం సహించడంలేదు. అప్పుడప్పుడు శరీరమంతా చెమటపట్టి కళ్లు తిరుగుతున్నాయి. ఈ నరకం భరించడం కంటే ఆత్మహత్య చేసుకోవాలని పిస్తుంది. అయితే పిల్లల కోసం జీవిస్తున్నాను. దయచేసి ఈ పరిస్థితులను అధిగమించే మార్గం చెప్పండి.

ఓ సోదరి, తిరుపతి

అమ్మా! ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు వారివి, మన సమాజంలో 99 శాతం ఆస్తికులమే. మతాలు వేరైనా అందరూ ఏదోరీతిలో పూజలు ప్రార్ధనలు చేస్తుంటారు. ఇది సహజ ప్రక్రియ. అయితే అతికొద్ది మంది మీ వారిలా ఉంటారు. ఇల్లు వాకిలి భార్య, పిల్లల్ని పట్టించుకోకుండా దేవ్ఞని ధ్యాసలో వ్ఞంటారు. వారు సర్వం దైవంగా భావిస్తారు. తాము చేయాల్సిన సహజ ధర్మాలను విస్మరించి పూర్తిగా తమలోకంలో తాము గడుపుతుంటారు. ఎంత చదివినా, ఎన్ని డిగ్రీలు చేసినా శాస్త్రీయతను నమ్మకుండా దైవత్వాన్ని నమ్ముకుంటారు. కాబట్టి అలాంటి వారిని ఎవరూ తప్పుపట్టలేరు. పైగా పుణ్యాత్ముడు, మహిమగల వారంటూ ఆరాధిస్తారు.

అయితే సుఖసంతోషాలకు దూరమైన భార్యగా మీరు బాధపడటాన్ని అర్థం చేసుకుంటాను. ఏ భార్య అయినా భర్తప్రేమ, అనురాగం, సాన్నిహిత్యాన్ని కోరుకుంటుంది. అవి దొరకనప్పుడు ఒత్తిడి, డిప్రెషన్‌కు గురవ్ఞతుంది. అలాగే కొందరు హిస్టీరియాకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. డిప్రెషన్‌ తీవ్రరూపం దాల్చితే ఆత్మహత్యకు దారితీసే ప్రమాదం ఉంది. అయితే మానసిక రుగ్మతల ప్రకారం మీ వారు ‘అబ్సెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ తో బాధపడుతున్నారని భావించాల్సివస్తుంది. అతిభక్తి, అతి శుభ్రత, చెప్పిందే చెప్పడం చేసిందే చేయడం లాంటివి ఈ రుగ్మత లక్షణాలు. అయితే భక్తి శ్రుతిమించినప్పటికీ ఇలాంటి వారిలో రుగ్మత ఉందని చేప్పే సాహసం ఎవరూ చేయరు. ఎందుకంటే విశ్వాసాలు, సెంటిమెంట్లతో ముడిపడిన అంశాల జోలికి వెలితే లేనిపోని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భయం.

కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న లక్షణాల ప్రకారం మీ వారు ఒసిడి లక్షణాలతో బాఢపడుతున్నారని చెప్పకతప్పదు. బాల్యం నుంచి భయం, ఆందోళన, సిగ్గు, సంకోశం ఎక్కువగా వ్ఞన్నవారు ఇలా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే పెంపకంలోపం, విచ్ఛిన్న కుటుంబ నేపథ్యం, పరిసరాల ప్రభావం కూడా ఇందుకు కారణం కావచ్చు, కొంతమందిలో సామర్ధ్యం లోపించడం కూడా కారణమై వ్ఞంటుంది. కాబట్టి మీ వారిని ఒప్పించి మంచి మానసిక నిపుణుడు లేదా వైద్యుని ద్వారా చికిత్స ప్రారంభించండి. సహజంగా ఇలాంటివారు వైద్య, చికిత్సలను నమ్మరు. అంతా తలరాతలో ఉందంటారు. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులకు తామే బోధించగలమంటారు. అవసరమైతే బలవంతంగా అయినా చికిత్స చేయించండి. అలాగే మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. సైకాలజిస్ట్‌ లేదా సైకియాట్రిస్టును కలసి మీలోని డిప్రెషన్‌ నుంచి బయటపడండి. ఎదుటి వారిని మార్చడం కన్నా మనం మారడం సులభమని గ్రహించండి. సానుకూల దృక్పధంతో సమస్య పరిష్కారానికి, ప్రత్యామ్నాయ మార్గాలు పరిశీలించండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు