నేడు ఢిల్లీకి వెళ్లనున్న సచిన్ పైలెట్

పైలెట్‌ చేపట్టిన నిరాహార దీక్షపై కాంగ్రెస్ ఆగ్రహం

Sachin Pilot

న్యూఢిల్లీః రాజస్థాన్ లో సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టిన సచిన్ పైలెట్… ఈరోజు ఢిల్లీకి వెళ్తున్నారు. తాను ఏప్రిల్ 11న తలపెట్టిన నిరాహార దీక్ష గురించి కాంగ్రెస్ పెద్దలకు వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. పైలెట్ దీక్షపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్.. ఆయనతో ఏం మాట్లాడనుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మరోవైపు.. పైలట్ పార్టీ సీనియర్ నాయకులను కలుస్తారా..? లేదా ..? అన్నది కూడా ఉత్కంఠ రేపుతోంది. అపాయింట్ మెంట్ ఇచ్చారా.? లేదా అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. గత బిజెపి ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి.. చర్యలు తీసుకోవాలంటూ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని సచిన్ పైలట్ చేసిన నిరాహార దీక్షపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ గా ఉంది. పైలట్ దీక్ష పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించింది.

గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌, మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇద్దరి మధ్య విబేధాలు కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. వీలు దొరికినప్పుడల్లా గహ్లోత్‌పై అసంతృప్తి వెళ్లగక్కుతున్న సచిన్‌.. తాజాగా మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. సొంత ప్రభుత్వానికి (కాంగ్రెస్) వ్యతిరేకంగా సచిన్‌ పైలట్‌ మంగళవారం (ఏప్రిల్ 11న) ధర్నా చేపట్టారు. రాజస్థాన్‌లో వసుంధర రాజే నేతృత్వంలోని గత బిజెపి ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. పైలట్‌ నిరాహార దీక్షపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించబడుతుందని హెచ్చరించింది. ఈ సమస్యను పైలట్‌ తమతో చర్చించలేదని కాంగ్రెస్‌ పేర్కొంది. ఈ మేరకు రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఇంచార్జీ సుఖ్‌జీందర్‌ సింగ్‌ రంధావా ఒక ప్రకటన విడుదల చేశారు. పైలట్ తనతో నిరాహార దీక్ష గురించి ఎప్పుడూ చర్చించలేదని తెలిపారు. ధర్నా చేయడం పార్టీ ప్రయోజనాలకు, కార్యకలాపాలకు విరుద్ధమని పేర్కొన్నారు. అశోక్‌ గహ్లోత్‌ తో ఏదైనా సమస్య ఉంటే సచిన్‌ పైలట్‌కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని హితవు పలికారు. ఇలా మీడియా, ప్రజల ఎదుటకు రావడం సరికాదన్నారు.