సీఎల్పీ సమావేశానికి మళ్లీ డుమ్మా కొట్టిన పైలట్

సచిన్ తీరుపై అధిష్టానం ఆగ్రహం

sachin-pilot

జైపూర్ : సీఎల్పీ సమావేశానికి కాంగ్రెస్ రెబల్ నేత సచిన్ పైలెట్ వరుసగా రెండో రోజు డుమ్మా కొట్టారు. భేటీకి రావాలంటూ కాంగ్రెస్ పంపించిన ఆహ్వానాన్ని ఆయన పక్కన పెట్టారు. సచిన్ సహా ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు ఎవరూ ఈ భేటీకి హాజరు కాలేదు. పలుమార్లు పైలెట్‌తో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కాగా సోమవారం జరిగిన మొదటి సమావేశానికి 104 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు కాంగ్రెస్ నేతలు చెప్పారు. అంతే కాకుండా ఐదుగురు ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా లేఖలు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు. అయితే అవి అవాస్తవమని, తనతో 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు పైలెట్ చెప్పుకొచ్చారు. గెహ్లాట్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్ చెబుతున్నారు. పైలెట్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. మరోసారి సచిన్‌కు అవకాశం ఇవ్వనున్నట్లు, అయినప్పటికీ మాట వినకపోతే ఆయన పై వేటు వేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి :https://www.vaartha.com/telangana/