స్పీకర్ ను కలిసిన సచిన్.. తదుపరి సిఎం రేసులో ముందున్న పైలట్

కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సీఎం అశోక్ గెహ్లాట్
గెలిస్తే సీఎం పదవికి రాజీనామా చేయనున్న గెహ్లాట్

sachin-pilot

జైపూర్: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పోటీలో ఉన్నారు. గాంధీ కుటుంబం నుంచి పోటీ ఉండదని ప్రకటన వచ్చిన నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో గెహ్లాట్ ముందంజలో కనిపిస్తున్నారు. ఒకవేళ అయన అధ్యక్ష పదవి దక్కించుకంటే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరన్నదానిపై ఉత్కంఠ మొదలైంది. మాజీ ఉప ముఖ్యమంత్రి, రాహుల్ గాంధీకి సన్నిహితుడైన సచిన్ పైలట్ రేసులో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన శుక్రవారం రాజస్థాన్ శాసనసభ స్పీకర్ సీపీ జోషిని కలుసుకోవడంతో దీనికి మరింత బలం చేకూరింది. మొన్నటిదాకా రాహుల్ గాంధీతో పాటు కొచ్చీలో ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న సచిన్ ఉన్నట్టుండి రాజస్థాన్ తిరిగి రావడం, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, చీఫ్ విప్ మహేశ్ జోషితో కలిసి అసెంబ్లీలో స్పీకర్ ను కలవడం చర్చనీయాంశమైంది.

అదే సమయంలో సీఎం పదవికి ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ పెద్దల నుంచి పోటీ పెరిగింది. ఆశావహులు తమ ప్రయత్నాల్లో ఉన్నారు. తదుపరి సీఎం ఎవరన్నది ఎమ్మెల్యేలను సంప్రదించిన తర్వాత అధిష్ఠానమే నిర్ణయిస్తుందని అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. పైలట్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించవచ్చని, గెహ్లాట్ విశ్వాసపాత్రుడిగా పేరుపొందిన స్పీకర్ సీపీ జోషిని సీఎం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత యువ నాయకుడు సచిన్ పైలట్ ని సీఎం పదవి వరిస్తుందని ప్రచారం జరిగింది. కానీ, అధిష్ఠానం అనుభవజ్క్షుడైన గెహ్లాట్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది.

పైలట్ కు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చింది. అప్పటి నుంచి పైలట్ అసంతృప్తితో ఉన్నారు. కొన్ని నెలల క్రితం తన పదవికి రాజీనామా కూడా చేశారు. దాంతో, ఆయన పార్టీ వీడి, బీజేపీలోకి వెళ్తాడన్న ప్రచారం కూడా జరిగింది. చివరకు రాహుల్ గాంధీ, అగ్ర నాయకత్వంతో సంప్రదింపుల తర్వాత ఆయన అలక వీడి పార్టీలో చురుగ్గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు ఆయనకే సీఎం పదవి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు ఆయనకు బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. మరోవైపు అధికార మార్పు జరిగేంత వరకూ జైపూర్ లోనే ఉండాలని సచిన్ పైలట్ ను అధిష్ఠానం అదేశించినట్టు సమాచారం.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/