నేటి నుంచి ‘రైతుబంధు’ పథకం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణలో నేటి నుంచి రైతుల ఖాతాల్లో ‘రైతుబంధు’ పథకం నిధులు జమ కానున్నాయి. ఈ పథకం ప్రారంభమయినప్పటి నుండి ఏడు విడతలలో రూ.43,036.63 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ చేసింది ప్రభుత్వం. ఈ సీజన్ తో కలుపుకుని మొత్తం రూ.50 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలో జమ కానున్నాయి. ఎకరాలోపు భూమి ఉన్నవారికి, బుధవారం 2 ఎకరాలు, గురువారం మూడెకరాలు.. ఇలా రోజూ ఎకరం చొప్పున పెంచుతూ రైతు ఖాతాల్లో నిధులు జమ చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతుబంధు పథకాన్ని ప్రపంచంలోని అత్యుత్తమ 20 పథకాల్లో ఒకటిగా రోమ్‌లో 2018 నవంబరులో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఎఫ్‌ఏవో గుర్తించిందని తెలిపారు.

ఈ నెల 10 నాటికి ధరణి పోర్టల్‌లో నమోదైన భూముల పట్టాదారులు, అటవీ భూముల యాజమాన్య హక్కులు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) పొందిన వారు రైతుబంధు పథకానికి అర్హులని ప్రభుత్వం తెలిపింది. యాసంగి సీజన్‌లో 66.61 లక్షల మంది రైతులకు, 152.91 లక్షల ఎకరాలకు, రూ.7,645.66 కోట్లు పంపిణీ చేయనున్నారు. ఆర్‌వోఎఫ్ఆర్‌ పట్టాదారులైన 94 వేల మంది రైతుల ఆధీనంలోని 3.05 లక్షల ఎకరాలకు కూడా రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందిచనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/