చర్చలకు తాలిబాన్లను ఆహ్వానించిన‌ ర‌ష్యా

మాస్కో: ర‌ష్యా ఆఫ్ఘ‌నిస్తాన్‌కు చెందిన తాలిబ‌న్ల‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్న‌ది. అక్టోబ‌ర్ 20వ తేదీన అంత‌ర్జాతీయ చ‌ర్చ‌లు నిర్వ‌హించేందుకు తాలిబ‌న్ల‌ను ర‌ష్యా ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌ల అమెరికా బ‌ల‌గాలు వెన‌క్కి వెళ్లిపోవ‌డంతో.. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించిన విష‌యం తెలిసిందే. ప్ర‌పంచ దేశాల‌తో స‌త్ సంబంధాల‌ను కోరుకుంటున్న‌ట్లు కూడా తాలిబ‌న్లు వెల్ల‌డించారు. ఈమ‌ధ్యే జ‌రిగిన ఐక్యరాజ్య‌స‌మితి స‌మావేశాల స‌మ‌యంలోనూ.. తమ త‌ర‌పు ప్ర‌తినిధి మాట్లాడేందుకు అవ‌కాశం ఇవ్వాల‌ని తాలిబ‌న్లు కోరారు. వివిధ దేశాల‌తో స‌ఖ్య‌త నెల‌కొల్ప‌న్న ఉద్దేశంతో తాలిబ‌న్ల‌ను చ‌ర్చ‌ల‌కు ర‌ష్యా ఆహ్వానిస్తోంది.

తాలిబ‌న్ ప్ర‌తినిధుల‌ను చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించిన‌ట్లు ర‌ష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌ర‌పు రాయ‌బారి వెల్ల‌డించారు. ఇప్ప‌టికే ఆహ్వానాన్ని పంపిన‌ట్లు జ‌మిర్ కుబులోవ్ తెలిపారు. అయితే మీటింగ్ ఎప్పుడు జ‌రుగుతుంది, ఎవ‌రు హాజ‌ర‌వుతార‌న్న అంశాల‌పై క్లారిటీ రాలేదు. నిజానికి తాలిబ‌న్ల‌ను నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ‌గా చూస్తారు. ర‌ష్యాలోనూ ఆ సంస్థ‌పై బ్యాన్ ఉన్న‌ది. అయితే శాంతి నెల‌కొల్పాల‌న్న ఉద్దేశంతో తాలిబ‌న్ల రాజ‌కీయ శాఖ‌తో చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఓ ఇస్లామిక్ రాజ్యంగా మారుస్తున్న‌ట్లు ఇటీవ‌ల తాలిబ‌న్ నేత‌లు ప్ర‌క‌టించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ దేశాలు తాలిబ‌న పాలిత ఆఫ్ఘ‌న్‌కు ఆ గుర్తింపు ఇవ్వ‌లేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/