రష్యా మార్కెట్‌లోకి విడుదలైన వ్యాక్సిన్‌

ప్రకటించిన రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Russia-releases-first-batch-Covid-19-vaccine-into-public

మాస్కో: ప్రపంచంలోనే కరోనా సోకకుండా తొలి వ్యాక్సిన్ ను తయారు చేసింది తామేనని గత నెల 11న ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రష్యా కొవిడ్‌ వ్యాక్సిన్‌ను రష్యా మార్కెట్‌లోకి విడుదలైంది. తాము అభివృద్ధి చేసిన ‘స్పుత్నిక్-‌వి’ వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్య శాఖ వెల్లడించింది. తొలి బ్యాచ్ ని విడుదల చేసిన ప్రభుత్వం, దాన్ని ప్రజలకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. పౌర అవసరాల నిమిత్తం వ్యాక్సిన్ ను విడుదల చేశామని, రీజియన్ల వారీగా వీటిని పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.

‘కరోనా సోకకుండా అడ్డుకునే తొలి బ్యాచ్ గామ్కోవిడ్ వాక్ (స్పుత్నిక్ వీ) అన్ని ల్యాబొరేటరీ క్వాలిటీ టెస్ట్ లను అధిగమించి, రోస్ డ్రావన్ డ్జోర్ (మెడికల్ డివైస్ నియంత్రణా మండలి) అనుమతులతో పౌర సమాజానికి అందుబాటులోకి వచ్చింది’ అని రష్యా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక ఈ వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా పలువురు సైంటిస్టులు అనుమానాలను వ్యక్తం చేసినా, రష్యా మాత్రం ఎవరి విమర్శలనూ పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. సమీప భవిష్యత్తులోనే రష్యా రాజధాని మాస్కో దేశవాసులందరికీ వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ వెల్లడించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/