ఉక్రెయిన్‌ నుండి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల స్థానికులకు రష్యా పౌరసత్వం

మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ప్రాంతాల ప్రజలకు రష్యా పౌరసత్వం, పాస్‌పోర్టులను అందజేస్తున్నారు. దీని కోసం మెలిటోపోల్‌లో మైగ్రేషన్‌ సర్వీస్‌ కార్యాలయాన్ని రష్యా ప్రారంభించింది. రష్యా పౌరసత్వం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నది. ఫాస్ట్‌ ట్రాక్‌ విధానంలో ఈ ప్రక్రియను పూర్తి చేసి రష్యా పాస్‌పోర్టులను అందజేస్తున్నది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల్లో వేలాది మంది ఉక్రెయిన్‌ ప్రజలు రష్యా పౌరసత్వం, పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తున్నది. కాగా, ఉక్రెయిన్‌ స్వాధీన ప్రాంతామైన ఖేర్‌సన్‌, జపోరిఝజియా ప్రాంతాలకు కూడా దీనిని విస్తరించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అధికారులను ఆదేశించారు.

మరోవైపు రష్యా పౌరసత్వం కోసం ఉక్రెయిన్‌ స్వాధీన ప్రాంతాల ప్రజల నుంచి నిత్యం వస్తున్న వందలాది దరఖాస్తులను ప్రోసెస్‌ చేయడం రష్యా అధికారులకు కష్టంగా మారినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో వారాంతపు రోజైన శనివారం కూడా అధికారులు రష్యా పాస్‌పోర్టులను జారీ చేసినట్లు చెప్పింది. అలాగే ఉక్రెయిన్‌లోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున రష్యా పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు చేస్తున్నారని పేర్కొంది. అయితే ఇప్పటి వరకు ఎంత మంది ఉక్రెయిన్ ప్రజలు దరఖాస్తు చేశారు, ఎంత మంది రష్యా పౌరసత్వం, ఆ దేశ పాస్‌పోర్టులు పొందారు అన్నది అధికారికంగా వెల్లడి కాలేదు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/