ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన : రష్యా అధినేత పుతిన్

ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకుపోయిన రష్యన్ బలగాలు
అత్యవసరంగా సమావేశమైన ఐక్యరాజ్యసమితి

మాస్కో : అందరూ భయపడిందే జరిగింది. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించింది. ఉక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ చేపడుతున్నామంటూ రష్యా అధినేత పుతిన్ అధికారికంగా సంచలన ప్రకటన చేశారు. ప్రపంచ దేశాలు వద్దని కోరుతున్నా పుతిన్ పట్టించుకోకుండా యుద్ధానికే మొగ్గు చూపారు. రష్యా కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు ఆయన ఈ ప్రకటన చేశారు.

తమకు మిలిటరీపరమైన సహాయం చేయాలంటూ ఉక్రెయిన్ వేర్పాటువాదులు విన్నవించిన తర్వాత రష్యా నుంచి యుద్ధ ప్రకటన వెలువడింది. మరోవైపు రష్యాను ఉద్దేశించి నిన్న రాత్రి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఉద్వేగభరితమైన విన్నపం చేశారు. యూరప్ లో పెద్ద యుద్ధానికి తెరతీయవద్దని రష్యాను కోరారు. ఉక్రెయిన్ లో రష్యా జాతి ప్రజలు కూడా ఉన్నారని చెప్పారు. పుతిన్ తో మాట్లాడేందుకు తాను ప్రయత్నించానని… కానీ పుతిన్ నుంచి స్పందన లేదని, కేవలం మౌనమే సమాధానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

పుతిన్ ఆదేశాలతో ఉక్రెయిన్ భూభాగంలోకి రష్యా బలగాలు చొచ్చుకుపోయాయి. బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఉక్రెయిన్ మూడు వైపులా రష్యన్ బలగాలు మోహరించాయి. దాదాపు 1.50 లక్షల రష్యాన్ సైనికులు యుద్ధరంగంలో ఉన్నారు. ఉక్రెయిన్ ను పూర్తి స్థాయిలో ఆక్రమించుకోవడమే లక్ష్యంగా పుతిన్ అడుగులు వేస్తున్నారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు ఆంక్షలు విధిస్తున్నా పుతిన్ ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. మరోవైపు యుద్ధం ప్రారంభమైన వెంటనే… ఐక్యరాజ్యసమితి అత్యవసరంగా సమావేశమయింది. పరిస్థితిని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే దానిపై చర్చలు జరుపుతోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/