4 ఉక్రెయిన్ నగరాల్లో రష్యా కాల్పుల విరమణ

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో బాంబుల మోత మోగిస్తున్న రష్యా మరోసారి కాల్పుల విరమణ ప్రకటించింది. నాలుగు నగరాల్లో పౌరులను తరలించేందుకు వీలుగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం) కాల్పులు విరమిస్తున్నట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్‌ మెక్రాన్‌ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. రష్యన్‌ బలగాలు ఉధృతంగా దాడులు జరుపుతున్న కీవ్‌, ఖార్కివ్‌, మరియుపోల్‌, సుమీ పట్టణాల్లో కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపింది. హ్యుమానిటేరియన్‌ కారిడార్‌ ఏర్పాటు అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించింది. కాగా, మరియుపోల్‌లో రష్యా సైన్యం కాల్పుల విరమణ ప్రకటించడం ఇది రెండోసారి. అయితే కొద్దిసేపటికే కాల్పులు ప్రారంభించడంతో పౌరుల తరలింపును అధికారులు నిలిపివేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/