పెగాస‌స్ పై విపక్షాల ఆందోళన.. ఉభ‌య‌స‌భ‌లు వాయిదా

లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

న్యూఢిల్లీ : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కాగా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో​ ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెగాసస్‌ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. ప్ల‌కార్డుల‌తో వెల్‌లోకి దూసుకువ‌చ్చారు. ఆ స‌మ‌యంలో స్పీక‌ర్ ఓం బిర్లా వారిని వెన‌క్కి వెళ్లాల‌ని ఆదేశించారు. ప్ర‌శ్నోత్త‌రాలు జ‌రుగుతున్న స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు నినాదాలు ఆప‌లేదు. దీంతో స్పీక‌ర్ బిర్లా.. విప‌క్ష స‌భ్యుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌రైన రీతిలో నోటీసు ఇవ్వ‌లేద‌ని ఆరోపించారు. ప్ర‌భుత్వం ఆ అంశంపై సోమ‌వార‌మే ప్ర‌క‌ట‌న చేసింద‌న్నారు. అయినా ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నినాదాలు కొన‌సాగించారు. అన్ని అంశాల‌పై స‌మాధానం ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని స్పీక‌ర్ తెలిపారు. గంద‌ర‌గోళం మ‌ధ్య స్పీక‌ర్ స‌భ‌ను మధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు.

మరో వైపు రాజ్య‌స‌భ‌లోనూ ఇదే సీన్ రిపీటైంది. విప‌క్ష స‌భ్యులు వెల్‌లోకి దూసుకురావ‌డంతో.. స‌భ‌ను చైర్మ‌న్ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు. లోక్‌సభ ఎంపీ అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ.. పెగాస‌స్ లాంటి ఇంటెలిజెన్స్ సిస్ట‌మ్‌ను ఎప్పుడైనా కాంగ్రెస్ వాడిందా.. ఇలాంటి గూఢ‌చ‌ర్యం గురించి త‌మ‌కు తెలియ‌ద‌న్నారు. న్యూ ఇండియా మేకింగ్‌కు ఇదో స్ట్రాట‌జీ అని అధిర్ ఆరోపించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/