హైదరాబాద్ లో తొలిసారి ‘జనరల్‌ రూట్‌ బస్‌పాస్‌’కు ఆర్టీసీ శ్రీకారం

TSRTC హైదరాబాద్ నగరవాసులకు మరో శుభవార్త తెలిపింది. టీ-24, టీ-6, ఎఫ్‌-24 టికెట్లతో ప్రయాణికులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తున్న సంస్థ..తాజాగా ‘జనరల్‌ రూట్‌ బస్‌పాస్‌’ తీసుకొచ్చింది. 8 కిలోమీటర్ల పరిధిలో రాకపోకలకు వర్తించే ఈ పాస్‌ ఈ నెల 27 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. నెలరోజుల పాటు వర్తించే సిటీ ఆర్డీనరీ రూట్‌ బస్‌పాస్‌కు రూ.600గా, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ పాస్‌కు రూ.1000గా సంస్థ నిర్ణయించింది.

ఐడీ కార్డుకు మరో రూ.50 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. మొదట హైదరాబాద్‌లోని 162 రూట్లలో ఈ పాస్‌ను ప్రయాణికులకు ఇవ్వనున్నది. 8 కిలోమీటర్ల పరిధిలో అపరిమితంగా ఎన్నిసార్లయినా బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటును సంస్థ కల్పించింది. సెలవు దినాలతో పాటు ఆదివారాల్లోనూ ఈ పాస్‌తో ప్రయాణించవచ్చని వెల్లడించింది.