హైదరాబాద్‌లో రోడ్డెక్కిన సిటీ బస్సులు

పరిస్థితులు అనుకూలిస్తే మరో వారంలో 50 శాతం బస్సులు

Hyderabad city buses to resume from Friday

హైదరాబాద్‌: దాదాపు ఆరు నెలలపాటు డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రోడ్డె‌క్కాయి. మొత్తం బస్సుల్లో 25 శాతమే తిప్పనున్నారు. రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌తో భేటీ అయి సిటీ బస్సుల రవాణా గురించి మాట్లాడారు. కరోనా నేపథ్యంలో పావు వంతు బస్సులు తిప్పటమే ఉత్తమమంటూ ఆర్టీసీ ఎండీ ఇచ్చిన నివేదిక మేరకే సిఎం అనుమతి ఇచ్చారు. శుక్రవారం ఉదయం షిఫ్ట్‌ నుంచి బస్సులు తిరుగుతున్నాయి. వారం, పది రోజుల తర్వాత పరిస్థితి సానుకూలంగా కనిపిస్తే, 50 శాతం బస్సులను అనుమతించనున్నట్టు సమాచారం.

మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అంతర్రాష్ట్ర బస్సులను పునరుద్ధరించేందుకు సిఎం అనుమతించారు. ఈ సర్వీసులు కూడా శుక్రవారం నుంచే ప్రారంభమవుతాయి. మొత్తంగా నేటి నుంచి న‌గ‌రంలో 800 బ‌స్సులు తిరుగుతున్నాయి. ఈ బ‌స్సుల‌ను ప్ర‌ధాన‌మైన రూట్ల‌లో న‌డుపుతున్నారు. సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల‌ను పున‌రుద్ధ‌రించ‌డంతో.. ప్ర‌యాణికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఒక్క సీట్లో ఒక‌రిని మాత్ర‌మే కూర్చోబెడుతున్నారు. కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆర్టీసీ అధికారులు ప్ర‌యాణికుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/