ఏపిలో ప్రారంభమైన ఆర్టీసీ సర్వీసులు

అత్యవసరమైతే తప్ప చిన్నారులు, వృద్ధులు రావొద్దంటున్న అధికారులు

APSRTC-bus

అమరావతి: ఏపిలో కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా బస్సులన్నీ డిపోలకే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం నుండి ఆర్టీసీ బస్సు సేవలు మొదలయ్యాయి. మొత్తం 436 మార్గాల్లో 1,683 బస్సులు అంటే 17 శాతం బస్సులను ఆర్టీసీ అధికారులు సిద్ధం చేశారు. ఈ బస్సులకు నిన్నటి నుంచే ఆన్‌లైన్ బుకింగ్ ప్రారంభమైంది. చార్జీలు పెంచకున్నప్పటికీ 50 శాతం మందితోనే ఈ బస్సులను నడపనున్నారు. అయితే, ప్రయాణికులు బస్సెక్కాలంటే మాత్రం కొన్ని నిబంధనలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అందులో మొదటిది ఆరోగ్యసేతు యాప్. ప్రతీ ప్రయాణికుడి వద్ద కోవిడ్19 ట్రాకింగ్ యాప్ ఉంటేనే బస్సులోకి అనుమతిస్తారు. ఇక, ఈ బస్సులు ప్రస్తుతానికి ఓ బస్టాండు నుంచి మరో బస్టాండుకు మాత్రమే నడుస్తాయి. 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, పదేళ్లలోపు చిన్నారులు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/