రౌడీ బాయ్స్ ట్రైలర్ ను విడుదల చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్

ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం రౌడీ బాయ్స్. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ చిత్రంతో ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు) హీరోగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించి సినిమాపై ఆసక్తి నింపారు.

ఈ సందర్భాంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రేమదేశం’ తరహాలో సాగిపోయే ‘రౌడీబాయ్స్’ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంక్రాంతికి విడుదలయ్యే చిత్రాలను థియేటర్లలోనే చూసి తెలుగు సినీపరిశ్రమను ఆదుకోవాలని కోరారు. కొత్త చిత్రాలను, నటీనటులను ప్రోత్సహించే గొప్ప మనసు తెలుగు ప్రేక్షకులకు ఉందన్నాడు.

ట్రైలర్ విషయానికి వస్తే.. కాలేజీ అంటే మంచి మంచి పోరీలు.. మస్తు మస్తు పార్టీలు – క్రేజీ ఈవెంట్స్ అని చెప్పడంతో ప్రారంభమవుతుంది. ఇది కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే యూత్ పుల్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. తండ్రితో తిట్లు తినే బాధ్యతలేని కుర్రాడిగా హీరో ఆశిష్ ను చూపించారు. ఇంజినీరింగ్ స్టూడెంట్ అయిన హీరో.. మెడికల్ కాలేజీకి చెందిన హీరోయిన్ అనుపమని ప్రేమించడం వల్ల జరిగిన గ్యాంగ్ వార్స్ ను ఇందులో ప్రధానంగా చూపించారు.

నిర్మాత లగడపాటి శిరీష్ తనయుడు సహిదేవ్ విక్రమ్ – కార్తీక్ రత్నం – శ్రీకాంత్ అయ్యంగార్ – తేజ్ కూరపాటి – కోమలీ ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. తొలి సినిమా అయినప్పటికీ ఆశిష్ ఎనర్జిటిక్ స్క్రీన్ అప్పీరియన్స్ తో ఆకట్టుకున్నాడు. అనుపమ క్యూట్ గా కనిపించడమే కాదు.. రొమాంటిక్ సీన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.

YouTube video