నెల్లూరులో ఈరోజు నుండి రొట్టెల పండుగ

నెల్లూరులో ఈరోజు నుంచి రొట్టెల పండుగ మొదలుకాబోతుంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది.

బారా షహాద్‌ దర్గా వద్ద ఈ నెల 13 వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయస్థాయిలోనూ గుర్తింపు ఉంది.

మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లిములు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా వద్ద వివిధ కోర్కెలు కోరుతూ, నెరవేరిన కోర్కెల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇస్తూ పుచ్చుకుంటూ జరుపుకునే ఈ పండుగను రొట్టెల పండుగ అంటారు. ఈ రొట్టెల పండుగలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది భక్తులు పాల్గొంటారు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటిఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెలపండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు. 1930 లలో ఈ రొట్టెల పండుగ మొదలై క్రమం తప్పకుండా జరుగుతూ, స్థానిక పత్రికలలో నమోదు అయివున్నట్లు తెలుస్తుంది. ఇంటిలో తయారు చేసుకొచ్చిన చపాతీలు (రొట్టెలు) చెరువు లోని నీళల్లో దిగి తలపై ముసుగువేసుకొని మార్పిడి చేసుకుంటారు భక్తులు.

ఆరోగ్యం గురించి మొక్కు కొంటే ఫలితం కనిపిస్తే మరుసటి ఏడాది ఆరోగ్య రొట్టెకావాల్సిన వారికి పంచి మొక్కు చెల్లిస్తారు.ఇలాగే విద్యా రొట్టె, పెళ్ళి రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, వీసా రొట్టె, అభివృద్ధి రొట్టె, సమైక్యాంధ్ర రొట్టె…ఇలా ఎన్నోరకాల రొట్టెలు ఇచ్చి పుచ్చుకుంటారు. వివిధ కోర్కెలకు సంబంధించి స్వీకరించుకున్న రొట్టెలకు బదులుగా తిరిగి మరుసటి సంవత్సరం ఒకటికి రెండు రొట్టెల చొప్పున ఈ స్వర్ణాల చెరువు వద్ద భక్తులకు పంచుతారు. మిగిలిన వాటిని ఈ చెరువులో వదిలేస్తారు.

ఇది ఫలానా కోర్కెకు సంబంధించిన రొట్టె అని సులభంగా గుర్తించేందుకు బ్యానర్లు ఏర్పాటు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీకగా జరిగే ఈ రొట్టెల పండుగలో రొట్టెలు మార్పిడి చేసుకొన్నభక్తులు జిల్లా లోని కసుమూరు, అనుమసముద్రం పేటలలోని దర్గాలను కూడా సందర్శిస్తారు. చెరువు వద్ద వున్న ఎపి పర్యాటకం వారు ఏర్పాటు చేసే బోటు షికారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. రొట్టెల పండుగ జరిగే సమయంలోనే బారా షహీద్ దర్గాలో గంధ మహోత్సవం జరుగుతుంది.