పవన్, లోకేశ్‌లను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్న మంత్రి రోజా

వైస్సార్సీపీ మంత్రి రోజా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , చంద్రబాబు , నారా లోకేష్ లపై కామెంట్స్ చేసారు. విజయవాడ భవానీ ద్వీపంలో మూడు రోజులపాటు నిర్వహించిన సంక్రాంతి సంబరాల ముగింపు కార్యక్రమానికి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రోజా మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ వారాహితో వచ్చినా, నారా లోకేశ్ యువగళంతో వచ్చినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. పాదయాత్రలు చేస్తే బరువు తగ్గుతారు తప్పితే వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎద్దేవా చేశారు. అలాగే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఫై కూడా పలు సెటైర్లు వేశారు.

చంద్రబాబు భ్రమలో నుంచి బాలకృష్ణ బయటకు రావాలని ఎద్దేవా చేశారు. స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడారా లేక తెలియక మాట్లాడారా అన్నది అర్దం కావడం లేదన్న మంత్రి.. చంద్రబాబు రోడ్ షో లలో 11మంది చనిపోతే బాలకృష్ణ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వాన్ని బాలకృష్ణ ఎమర్జెన్సీ అనడం హాస్యాస్పదమని మండిపడ్డారు. అన్‌స్టాపబుల్‌లో ఎన్టీఆర్‌పై జరిగిన చర్చ స్క్రిప్ట్‌ అని ప్రజలందరూ భావిస్తున్నారని రోజా అన్నారు. ఎవరు చచ్చినా పరవాలేదు. నా బావ మీటింగ్ జరగాలి. నా బావ కళ్ళలో ఆనందం చూడాలని బాలకృష్ణ అనుకుంటున్నారని విమర్శించారు. బాలకృష్ణకు ప్రజల కష్టాలు తెలియదా అని నిలదీశారు. ప్రజల సొమ్ముతో డబ్బులు సంపాదించి వారి డబ్బుతో మేడలు కట్టుకుని ఆ ప్రజలు చనిపోతే మాట్లాడరా మంత్రి రోజా.. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇక తమ శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధి కోసం జీవో కూడా తీసుకొచ్చినట్టు తెలిపారు. భవానీ ద్వీపంలో తొలిసారి ఈ ఏడాది నూతన సంవత్సర వేడుకలు నిర్వహించినట్టు మంత్రి గుర్తు చేశారు.