తగ్గేదెలే అంటూ కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా మరోసారి వార్తల్లో నిలిచింది. భర్త సెల్వమణితో పోటాపోటీగా కబడ్డీ ఆడి తగ్గేదెలే అనిపించుకుంది. నవంబర్‌ 17న రోజా పుట్టినరోజును పురస్కరించుకుని ‘రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్’ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది వివిధ క్రీడా పోటీలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా నగరి డిగ్రీ కళాశాలోని క్రీడా మైదానంలో ‘స్పోర్ట్స్‌ మీట్‌’ నిర్వహిస్తున్నారు. నవంబర్‌ 1 నుంచి 16 వరకు కొనసాగే ఈ క్రీడా పోటీలను సోమవారం రోజా దంపతులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరూ విద్యార్థులతో కాసేపు కబడ్డీ ఆడారు. వేర్వేరు గ్రూపులుగా విడిపోయి కబడ్డీ కబడ్డీ అంటూ తలపడ్డారు. ఈ నేపథ్యంలో ‘కబడ్డీ.. కబడ్డీ’ అంటూ కూతపెడుతూ బరిలోకి దిగి ఆటగాళ్లతో కలిసి హుషారుగా కబడ్డీ ఆడారు. కోర్టులోకి దిగి కూత పెట్టడానికి వెళ్లిన రోజాను ఔట్ చేయ‌డానికి భ‌ర్త సెల్వ‌మ‌ణి ప్ర‌య‌త్నించ‌గా విఫలమయ్యారు. అనంత‌రం సెల్వమణి కూడా కూత‌కు వెళ్లినా ఆయనను రోజాతో పాటు ఇతర క్రీడాకారులు ఔట్ చేయ‌లేక‌పోయారు. సరదాగా రోజా కబడ్డీ ఆడిన వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది.