కృష్ణం రాజుకు నివాళ్లు అర్పించిన ఏపీ మంత్రులు

అనారోగ్యంతో కన్నుమూసిన రెబెల్ స్టార్ కృష్ణంరాజు కు కడసారి వీడ్కోలు పలికారు ఏపీ మంత్రులు. ఆదివారం ఉదయం కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణంరాజు ఇకలేరు అని తెలిసి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు , అభిమానులు తరలివచ్చి అయన కడసారి వీడ్కోలు పలికారు. ఈరోజు సోమవారం ఏపీకి చెందిన పలువురు మంత్రులు , నేతలు కృష్ణంరాజుకు నివాళ్లు అర్పించారు. వారిలో సీనియర్ నటి , వైస్సార్సీపీ మంత్రి రోజా కూడా ఉన్నారు.

నివాళ్లు అర్పించిన అనంతరం మీడియా తో రోజా మాట్లాడుతూ..పేరులో రెబల్ స్టార్ ఉన్నప్పటికీ ఆయన మనసు ఎంత మంచిదో, ఆయన ఎంత మంచి మనిషో ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. సినీ పరిశ్రమలో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరావు, కృష్ణంరాజు, శోభన్ బాబు తదితరులు పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనందరం కళ్లారా చూశామని అన్నారు. తాను ఆయనతో కేవలం ఒక్క సినిమా మాత్రమే చేసినప్పటికీ… తాను ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించే వారని తెలిపారు. ఈ రోజు ఆయన లేరు అనే వార్త విని చాలా బాధ పడ్డానని చెప్పారు. ఆయన మరణం సినీ, రాజకీయ రంగాలకు తీరని లోటు అని అన్నారు. ప్రకృతిని చాలా బలంగా నమ్మిన వ్యక్తి అని… ఆయుర్వేదం అంటే ఆయనకు చాలా ఇష్టమని చెప్పారు. అడిగిన వారందరికీ సాయం చేసే గొప్ప మనిషి అని కొనియాడారు. కృష్ణంరాజు గారి కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.