నారా లోకేష్ పార్టీలోకి రావడంతోనే టీడీపీ పతనం మొదలైంది – రోజా

నారా లోకేష్ పార్టీలోకి రావడంతోనే టీడీపీ పతనం మొదలైందన్నారు వైస్సార్సీపీ మంత్రి రోజా. రైతులు, మహిళలు, యువతకు అందజేస్తున్న సంక్షేమ పథకాల కారణంగానే మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ముఖ్యమంత్రి జగన్‌ వెన్నంటే నిలిచారని రోజా పేర్కొన్నారు. బుర్రలేని లోకేష్ తనకు కొడుకుగా ఎలా పుట్టాడని జగన్‌ను చూసిన ప్రతి క్షణం చంద్రబాబు ఏడుస్తుంటాడని రోజా ఎద్దేవా చేశారు. రైతులకు మద్దతు ఇస్తున్నామంటూ ఎడ్ల బండిని లాక్కొని నారా లోకేశ్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు.

వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన చంద్రబాబు కుమారుడు ఈరోజు జగన్‌ను రైతు ద్రోహి అనడం బాధేస్తుందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 39 నెలల్లోనే 39 ఏండ్లుగా రైతులు పడుతున్న కష్టానికి పుల్‌స్టాప్‌ పెట్టి రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందించారని వెల్లడించారు. గత మూడున్నరేండ్లలో రైతుల కోసమే రూ.1.27 వేల కోట్లు ఖర్చు చేశామని, వీటిలో రూ.83 వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించామని, రూ.43 వేల కోట్లు ధాన్యం సేకరణకు వెచ్చించామని తెలిపారు. చంద్రబాబు పుణ్యమా అని రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని, ఆయన మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులను జగన్‌కు ఇచ్చి వెళ్లారని ఆరోపించారు.

నారా లోకేష్ ఏనాడైనా టీడీపీ జెండా పట్టారా? ప్రజల కోసం ఏమైనా చేశాడా? అని రోజా ప్రశ్నించారు. ఆయనను ఎమ్మెల్సీగా చేసి మంత్రిపదవి కట్టబెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైందన్నారు. కేవలం అధికార దాహం తప్ప మరోటి కాదన్నారు. ప్రజా సమస్యలపై అవగాహన లేని, రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని నారా లోకేష్ ఏవిధంగా తింగరోడి మాదిరిగా ఏదో చేస్తున్నానని చెప్పి మరేదో చేసి నవ్వులపాలవుతున్నారని రోజా దుయ్యబట్టారు.