రోహిత్‌ మరో అరుదైన రికార్డు…

Rohit sharma
Rohit sharma

రాంచీ: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ ద్వారా ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన టీమిండియా హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ మరో అరుదైన రికార్డును సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో రోహిత్‌ (212) డబుల్‌ సెంచరీ సాధించడంతో ఒక అరుదైన ఫీట్‌ను నమోదు చేశాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు రెండు వేర్వేరు ఇన్నింగ్స్‌ల్లో నమోదు చేసిన స్కోరు కంటే ఎక్కువ పరుగులు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రోహిత్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే చాపచుట్టేసింది. దాంతో రోహిత్‌ చేసిన పరుగుల్ని కూడా సఫారీలు తమ ఇన్నింగ్స్‌లో సాధించలేకపోయారు. అంతకుముందు ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో వినూ మన్కడ్‌ (231-న్యూజిలాండ్‌పై) తొలిసారి ఈమార్కును చేరగా, ఆపై రాహుల్‌ ద్రవిడ్‌ (270-పాకిస్తాన్‌పై) రెండో స్థానంలో ఉన్నాడు.

ఒక మూడో స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌ (248-బంగ్లాదేశ్‌పై), నాల్గో స్థానంలో విరాట్‌ కోహ్లీ (243-శ్రీలంకపై)లు ఉన్నారు. 1955-56 సీజన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో మన్కడ్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌ 209 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 219 పరుగులు చేసింది. 2003-04 సీజన్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రాహుల్‌ ద్రావిడ్‌ దీన్ని సాధించాడు. పాకిస్తాన్‌ తన తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకే ఆలౌటైతే, రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులు చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి. https://www.vaartha.com/andhra-pradesh/