ప్రజాసేవకు ప్రాధాన్యం

రోహిణీ సింధూరి, ఐఏఎస్

Rohini Sindhuri IAS
Rohini Sindhuri IAS

ఆమెకు పేరు పరిచయం అవసరం లేదు. రోహిణీ సింధూరి అంటేనే ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న ఆమె కెరీర్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుంది.

ప్రస్తుతం కర్ణాటకలో నిజాయితీగల కలెక్టర్‌గా తన విధులను నిర్వహిస్తున్న రోహిణి భారతదేశానికి సేవలను అందించేందుకు ఐఏఎస్‌ వృత్తిని ఎంచుకున్నారు.

తన తోటి స్నేహితులు విదేశాలకు వెళ్లిపోతే ఆమె మాత్రం దేశంపై ఉన్న అభిమానంతో సివిల్స్‌ను ఎంచుకున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. సివిల్‌ సర్వీసెస్‌లో 43వ ర్యాంకును సాధించి, దేశానికి ఆదర్శంగా నిలిచారు.

ఈ వృత్తిలోకి ఎందుకు వచ్చారని? అడిగితే నిజానికి మా కుటుంబంలో ఐఏఎస్‌లు కాదు కదా ప్రభుత్వ ఉద్యోగి కూడా లేరు.

ఇక నా బ్యాచ్‌మేట్‌లో చాలామంది ఇంజినీరింగ్‌ అవ్వగానే విదేశాలకు వెళ్లిపోయారు. కానీ మొదటి నుంచీ నాకు మనదేశం విడిచి వెళ్లడం ఇష్టం లేదు. దానికి తోడు ఐఏఎస్‌ అయితే ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం కలుగుతుంది.

ఓ పెళ్లికి వెళ్లినప్పుడు సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ అధిపతి ఆర్సీరెడ్డిగారు కూడా ఇదే సలహా ఇచ్చారు. దీంతో కెమికల్‌ ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఉన్నప్పుడే సివిల్‌ సర్వీస్‌ పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నాను.

అనుకున్నట్టుగానే రాశాను. ఐఏఎస్‌ అయ్యాను. కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణిగా ఎంపికైన తర్వాత మంగళూరులో ఏడాది ప్రొబెషనరీ పీరియడ్‌. ఆ సమయంలోనే కన్నడ భాష బాగా నేర్చుకున్నా.

తర్వాత తుమ్కూరు అసిస్టెంట్‌ కమిషనర్‌గా పోస్టింగ్‌. అక్కడ ఓ 40 ఎకరాల స్థలం 20 ఏళ్లుగా వివాదాలతో నిరుపయోగంగా పడిఉంది.

ఆ సమస్యపై స్థానిక రైతులను కలిశాను. రాజకీయ నాయకులు తొలుత అడ్డుచెప్పారు. అయితే వారందరితో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించాను

మొదటి పోస్టింగ్‌లోనే అన్నేళ్ల వివాదానికి తెరదించడం సంతోషాన్నిచ్చింది.

ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడానికి ఈ ఉద్యోగంలో చాలా అవకాశం ఉంటుంది. అయితే వాటిల్లో ఏది ముఖ్యమో నిర్ణయించుకోవాలి.

అది నేను జిల్లా పంచాయిత్‌ సిఇవోగా మాండ్యా వెళ్లిన సమయం. అప్పటికి ఇంకా ‘స్వచ్ఛభారత్‌ మిషన్‌ రాలేదు. నాకు కొన్ని రిపోర్ట్స్‌ వచ్చాయి.

వాటిల్లో ఒకటి బహిర్భూమికి వెళ్లిన మహిళ పాము కరిచి చనిపోయిందని. మరొక ఘటనలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిందని. ఈ ఉదంతాలు నన్ను దిగ్భ్రాంతికి గురిచేశాయి.

మరుగుదొడ్లు లేకపోతే ఇన్ని సమస్యలుం టాయా అనిపించింది. దాంతో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉండేలా ప్రణాళిక రూపొందించాం. అతితక్కువ సమయంలో లక్షకు పైగా నిర్మించాం.

దేశంలో మూడేజిల్లాలు ఈ ఘనత దక్కించుకున్నాయి. అందులో మాండ్యా ఒకటి కావడం మేం సాధించిన పెద్ద విజయం.

మా పని గుర్తించిన ప్రధాన మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ రంగంలో చాలా రకాల ఒత్తిడులు ఎదుర్కోవాలి. రాజకీయ నాయకులు, సీనియర్లు, ప్రజల, మీడియా ఇలా అన్నివైపుల నుంచి ఒత్తిడి ఉంటుంది.

అలాంటి ఘటనే మస్తకాభిషేకం. దీన్నే ‘జైన్‌ కుంభ్‌ అని కూడా అంటారు. శ్రావణబెళగొళలో 54 మీటర్ల ఎత్తయిన బహుబలి గోమటేశ్వర విగ్రహం అది. మూడువేల మెట్లు ఉంటాయి.

సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోతే భక్తులు మెట్లపై నుంచి పడే ప్రమాదం ఎక్కువ. ఏర్పాట్ల కోసం ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయించింది. దానికి టెండర్లు పిలవాలనుకున్నాను.

కానీ స్థానిక మాజీ మంత్రి ఒకరు ఆ టెండర్లు తనవారికే ఇవ్వాలని పట్టుబట్టారు. నేను కుదరదన్నా. జరగరానిది జరిగితే వారి ప్రాణాలకు ముప్పే కాకుండా, దేశవ్యాప్తంగా రాష్ట్రపరువు పోతుంది.

ఆయనకు ఇదే విషయం చెప్పే ప్రయత్నం చేశాను. వినలేదు. నేను ఆలోచించలేదు. అనుకున్నట్టు టెండర్లు పిలిచాం.

తక్కువ సమయంలోనే విజయవంతంగా ఉత్సవాన్ని నిర్వహించగలిగాం. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఆయన కోడ్‌ ఉల్లంఘించారు.

దానికి నోటీసులు ఇచ్చాను. ఈ ఉదంతాల తరువాత అక్కడి నుంచి నన్ను ట్రాన్స్‌ఫర్‌ చేయించారు. కానీ స్థానిక ప్రజలు నేను అక్కడే పనిచేయాలని కోరుకున్నారు. నేనూ న్యాయపోరాటానికి దిగాను. కోర్టు ఆ బదిలీని రద్దు చేసింది.

అప్పట్లో ఆ సంఘటన బాగా చర్చనీయమైంది. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసినప్పుడు ఎంతో సంతృప్తి కలుగుతుంది. హసన్‌ జిల్లా కలెక్టర్‌గా చార్జ్‌ తీసుకొనే సమయానికి విద్యలో ఆ జిల్లా చాలా వెనుకబడి ఉంది.

కర్ణాటకలో మొత్తం 30 జిల్లాలను 34 ఎడ్యుకేషన్‌ డిస్ట్రిక్స్‌గా విభజించారు. ఆ ప్రకారం పదో తరగతి ఫలితాల్లో హసన్‌ 31వ ర్యాంకులో ఉంది. ముందు దానిపై దృష్టిపెట్టాను.

స్టేట్‌ సిలబస్‌ నుంచి సిబిఎస్‌ఇ సిలబస్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యేలా టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాలనుకున్నారు. అయితే అందుకు టీచర్లు అభ్యంతరం చెప్పారు.

చివరకు ఈ విషయం అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చేంత పెద్దదైంది. అయినా నేను వదల్లేదు. శని, ఆదివారాల్లో టీచర్లకు శిక్షణ తరగతులు నిర్వహించాం. దానివల్ల రెండేళ్లలో హసన్‌ ఏడో స్థానానికి వచ్చింది.

ఆ తరువాత అగ్రస్థానంలో నిలిచింది. కర్ణాటక చరిత్రలో పదోతరగతి ఫలితాల్లో హసన్‌ ఫస్ట్‌ రావడం అదే మొదటిసారి.

వ్యవస్థీకృతంగా పనిచేస్తే నిలకడైన ఫలితంగా వస్తాయన్నది ప్రత్యక్షంగా చూశాను. నా పదకొండేళ్ల కెరీర్‌లో చాలాసార్లే బదిలీలు అయ్యాయి.

అయితే ఎక్కడకు వెళితే అక్కడే నాకు పని ఉంటుంది. నన్ను ‘కర్ణాటక బిల్డింగ్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ వర్కర్స్‌ వెల్ఫేర్‌ బోర్‌ (కెబిసిడబ్ల్యూడబ్ల్యూబి)కి సెక్రటరీగా బదిలీ చేసినప్పుడు కొంతమంది మిత్రులు అన్నారు

‘అక్కడ నువ్వు చేయడానికి ఏమీ ఉండదు అని కానీ నా ఇన్నేళ్ల అనుభవంలో తెలుసుకున్నది ప్రతిరంగంలో సంస్కరణలకు ఆస్కారం ఉందని. కెబిసిడబ్ల్యూడబ్ల్యూబి నే తీసుకొంటే దాని వద్ద 8వేల కోట్ల నిధులున్నాయి.

20 లక్షల మంది కార్మికులున్నారు. మహారాష్ట్ర తరువాత కర్ణాటక బోర్డే సంపన్నమైనది. కానీ కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసింది అతితక్కువ.

ఈ నిధుల ద్వారా భవన నిర్మాణ కార్మికులందరికీ ప్రయోజనం కలిగించేలా ప్రయత్నాలు మొదలుపెట్టాను. అందులో దాదాపు 8వందల యూనియన్లు ఉన్నాయి.

వాళ్లందరినీ ఒప్పించి ఏకతాటిపైకి తేగలిగాను. కార్మికులు, వారి పిల్లలకు విద్య, వైద్యంతో పాటు నైపుణ్యం పెంచుకోవడానికి ఆన్‌సైట్‌ ట్రైనింగ్‌, ఏ అవసరం వచ్చినా పలికేందుకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశాను.

ఇంతలో నన్ను సెరీకల్చర్‌ (పట్టుపురుగుల పెంపకం) విభాగానికి బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వులు అందాయి.

దానికి కారణం. ఆ మధ్య కర్ణాటకలో వరదలు వచ్చాయి. దాని సహాయ నిధి కోసం కొన్నివేల కోట్ల బోర్డు నిధులు ఇవ్వమని కార్మికశాఖ కార్యదర్శి మణివణ్ణన్‌ ఆదేశించారు. నేను అది సాధ్యం కాదన్నాను.

అలా చేయకపోతే ట్రాన్స్‌ఫర్‌ చేస్తానని ఆయన హెచ్చరించారు. బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి తప్ప మరే పనులకూ ఉపయోగించకోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి.

అలాంటప్పుడు నిబంధనలకు విరుద్ధంగా నేనెలా ఇవ్వగలను? ఇదే ప్రశ్నించినందుకు నన్ను బదిలీ చేశారు. నిజాయితీ గల అధికారి అంటే ఇప్పుడు అదో అరుదైన వస్తువులా అయిపోయింది.

ఇది చాలా బాధాకర పరిణామం. ప్రభుత్వ అధికారి అంటేనే నిజాయితీగా ఉండాలి కదా! ఇది అనుక్షణం ఒత్తిడి ఉండే ఉద్యోగం. దాని నుంచి బయటపడటానికి పెయింటింగ్‌ వేస్తాను.

సెలవు దొరికితే ఇంట్లోనే ఉంటాను. ఒక్కోసారి ఇంట్లో వాళ్లు అంటుంటారు. ప్రతిచోటా అలాగే ఉన్నారు కదా! ఇంత ఒత్తిడితో పనిచేయడం అవసరమా అని!

కానీ అలాంటి సవాళ్లను ఎదర్కోగలిగితేనే కదా మన సత్తా ఏమిటో తెలిసేది. పరిస్థితులకు తలవంచి క్యారెక్టర్‌ను మార్చుకోవడం నా మనస్సాక్షికి విరుద్ధం. నేనింతే ఇలాగే ఉంటా అంటున్నారు రోహిణీసింధూరి.

పని చేసే మహిళలెవరికైనా కుటుంబ మద్దతు ఉండాలి. పెళ్లికి ముందు తల్లిదండ్రులు తరువాత భర్త, అత్త మామల సహకారం అవసరం. వాళ్లే లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేదాన్నే కాదు.

మాకు ఓ అబ్బాయి, ఓ అమ్మాయి. వాళ్లను మా అత్తగారు చూసుకోవడం వల్లే నేను ఇంత ప్రశాంతంగా పని చేసుకోగలుగుతున్నా.

మహిళలకు చెప్పేది ఒక్కటే ఏ సమయానికి అదే చేయాలి. బాగా చదువుకోవాలి. కోరుకున్న కెరీర్‌లో సెటిలవ్వాలి.

మన కాళ్లపై మనం నిలబడ్డాకే పెళ్లి చేసుకోవాలి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరిగి, ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది.

గతంలో అయితే ఇంజినీరింగ్‌ లేదంటే మెడిసిన్‌ అంతే! కానీ ఇప్పుడు కెరీర్‌ ఆప్షన్స్‌ చాలా ఉన్నాయి. వాటిల్లో ఏది నచ్చుతుందో అదే ప్రయత్నించండి.

ఒకవేళ సివిల్‌ సర్వీసెస్‌కు సన్నద్ధం కావాలనుకొంటే జనరల్‌ రీడింగ్‌ బాగా చేయాలి.

నాకు మొదటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు ఉండటం కలిసొచ్చింది. రెండోది లోతుగా ఆలోచించడం. ఇక మనం క్రికెట్‌, రాజకీయాలు, సినిమాల వంటివే సెలబ్రేట్‌ చేసుకొంటున్నాం.

కానీ చంద్రయాన్‌ గురించి ఎంతమందికి తెలుసు? నిజమైన హీరోలు చంద్రయాన్‌ లాంటివాటి వెనక ఉన్నవాళ్లు.

ఒక విభాగంలో ఉన్నామంటే దాని లోతుపాతులు తెలుసుకోవడానికి ఎంతో సమయం కేటా యించాలి.

తీరా దానిపై అంతగా పనిచేశాక అక్కడి నుంచి వేరే చోటకు మార్చేస్తే కష్టపడిన దానికి ప్రయోజనం ఏముంటుంది? రాజకీయ నాయకులకు ఐదేళ్ల పదవీకాలం ఉంటుంది.

అలాగే మాలాంటి అధికారులను నిర్దిష్ట సమయంలోపు మార్చకూడదనే నిబంధన ఎందుకు పెట్టరు?

రాజకీయ నాయకులు ప్రమేయం, ఒత్తిడులు పక్కన పెడితే మేం తీసుకొనే నిర్ణయాల వల్ల చాలా మందికి ప్రయోజనం కలుగుతుంది అన్నారు రోహిణి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/