ఆఫ్ఘనిస్థాన్​ అధ్యక్ష భవనంపై రాకెట్ల‌తో దాడి

భవనం వెలుపల పడిన 3 రాకెట్లు

కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ లోని ఆ దేశ అధ్యక్ష భవనం లక్ష్యంగా రాకెట్ దాడులు జరిగాయి. అయితే, ఆ రాకెట్లు భవనం వెలుపల పడ్డాయి. నేటి ఉదయం ఈద్ ప్రార్థనలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరిగాయి. మూడు రాకెట్లు అధ్యక్ష భవనం బయట పడ్డాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రతినిధి మీర్వాయిస్ స్టానెక్జాయ్ చెప్పారు. పర్వానీసే ప్రాంతం నుంచి రాకెట్లను ప్రయోగించినట్టు అధికారులు చెబుతున్నారు. కాబూల్ జిల్లా 1లోని బాఘీ అలీ మర్దాన్, చమనీ హజోరీ, కాబూల్ జిల్లా 2లోని మనాబీ బషారీ ప్రాంతాలపై రాకెట్లు పడ్డాయంటున్నారు. ఈ దాడులు ఎవరు చేశారన్న దానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదని చెబుతున్నారు. అయితే, దాదాపు అన్ని జిల్లాలను ఇప్పటికే ఆక్రమించేసిన తాలిబన్ ఉగ్రవాదుల పనే అయి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, అధ్యక్ష భవనంలో జరిగిన ఈద్ ప్రార్థనలకు అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా హాజరయ్యారు. రాకెట్ దాడులు జరగడంతో ప్రార్థనలకు కొద్దిగా అంతరాయం ఏర్పడింది. రాకెట్ దాడుల శబ్దాల మధ్యే వారంతా భయంభయంగా ప్రార్థనలు చేశారు. వాస్తవానికి ఏటా ఈద్ సందర్భంగా తాలిబన్లు కాల్పుల విరమణను పాటిస్తారు. కానీ, ఈ ఏడాది అలాంటిదేమీ లేదు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/