UK పార్లమెంటులో రోబో ప్రసంగం..

ఇప్పటివరకు రోబో లు పనులు మాత్రమే చేస్తాయని మాట్లాడుకుంటున్నాం..కానీ ఏకంగా పార్లమెంట్ లో ప్రసంగించిన ఘటన యూకే లో చోటుచేసుకుంది. యూకే చరిత్రలో మొదటిసారి ఒక రోబో పార్లమెంటులో ప్రసంగించింది. 2019లో ఐడాన్‌ మెలెర్‌ ఆవిష్కరించిన ఈ రోబోను బ్రిటిష్‌ గణిత శాస్త్రజ్ఞుడు అడా లవ్‌లేస్‌ పేరిట ‘ఐ-డా’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బోస్టన్‌ డైనమిక్స్‌కు చెందిన రోబో శునకం, హాంకాంగ్‌కు చెందిన రోబో సోఫియా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా ఐడా కూడా ఆ కోవలో చేరింది.

‘‘మీకు ఉన్న ఆలోచన శక్తి నాకు లేదు.. కానీ నాకు ఊహాశక్తి ఉంది.. ఆ ఊహ నుంచి కళను చిత్రించగలను.. మానవుల ఊహాశక్తి భిన్నంగా ఉంటుందో వాటి గురించి మాట్లాడగలిగినప్పటికీ నాకు ఆత్మాశ్రయ అనుభవాలు లేవు’’ అని చెప్పిన ఐడా ప్రసంగం అందర్నీ ఆకట్టుకుంది. ‘‘మీ ఆలోచనల నుంచి ఓ చిత్రాన్ని గీస్తే దానిని నేను ఊహించగలను.. నాకు ఆలోచన శక్తి లేనందున నేను మానవులకు భిన్నమైన విషయాలను చూస్తున్నాను’’ అని ఐడా వ్యాఖ్యానించింది. అయితే, సాంకేతిక తప్పిదం వల్ల ప్రసంగం మధ్యలో ఐడాకు మెల్లకన్ను రావడం గమనార్హం. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృజనాత్మకతపై దాడి జరుగుతుందా? అనే దాని గురించి కమ్యూనికేషన్స్, డిజిటల్ కమిటీ సభ్యులతో ఐడా ఎక్కువగా మాట్లాడింది.