గుడికే గురిపెట్టిన కేటుగాళ్లు.. ఎక్కడంటే?

తాము చేసిన తప్పులను క్షమించాలని భగవంతుడిని వేడుకునేందుకు గుడికి వెళ్తుంటారు అందరూ. కానీ కొందరు వ్యక్తులు మాత్రం ఆ దేవుడికే టెండర్ పెట్టేందుకు ప్లాన్ చేశారు. గుడిలోకి భక్తులుగా వచ్చిన కొందరు దుండగులు చేసిన పనికి బిత్తరపోవడం ఆలయ సిబ్బంది వంతు అయ్యింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. ముత్తుకూరు మండలంలోని అర్చనతోపులో ఉన్న సీతలాంబ ఆలయంలో భక్తులుగా ముగ్గురు వ్యక్తులు ఆలయంలోకి అడుగుపెట్టారు.

అయితే వారు ఆలయంలోని విలువైన వస్తువులను తస్కరించేందుకు ప్లాన్ చేశారు. భక్తులుగా వచ్చిన వారు ఆలయం మొత్తం తిరిగి చూశారు. ఈ క్రమంలోనే గుడిలోకి చొరబడిన వారు ఆలయంలోని బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బంగారం మాయమైనట్లు గ్రహించిన ఆలయ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకుని ఆలయానికి వచ్చిన పోలీసులు దుండగులు దొంగతనం చేసిన విధానంపై ఆరా తీశారు.

సీతలాంబ అమ్మవారి ఆలయంలో దొంగతనం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు వెంటనే సదరు దుండగులను పట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయ చోరీ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. గుడికే కన్నం పెట్టిన ఆ దుండగులు ఎవరో తెలుసుకుని వారి భరతం పట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.