రహదారులపై మృత్యుఘోష ఆగేదెప్పుడు?

Road Accidents
Road AccidentsRoad Accidents

ప్ర పంచంలోనే అతిపెద్ద రహదారి వ్యవస్థ కలిగిన దేశాల్లో భారతదేశం రెండ వది. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిన ‘మోటారు వాహనాల చట్టం 2019 ప్రకారం లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడపటం, తాగి వాహనాలు నడపడం, సీటుబెల్టు లేకుండా వాహనాలు నడపడం, శిరస్త్రాణం లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపటం తదితర రహదారి నియమాలను అతిక్రమిస్తే భారీ జరిమానాలు, శిక్షలు విధించేలా కొత్త చట్టంలో ఉంది. ఈ చట్టం అమలైన తొలి ఐదు రోజుల్లో ఒక్క బెంగళూరు నగరంలోనే 6813 ఉల్లంఘనలు గుర్తించి 70 లక్షలకుపైగా జరిమానాలు వసూలు చేశారు. 2020 నాటికి తమ దేశాల్లో రోడ్డు ప్రమాదాల ను సగానికి తగ్గిస్తామని ఐక్యరాజ్యసమితి తీర్మానంపై సంతకం చేసిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం విడుదల చేసిన గణాంకాల మేరకు దేశంలో రోజుకు 405 మంది రహదారులపై జరిగే ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ప్రతి మూడు రహదారి ప్రమాదమరణాల్లో ఒకటి అతివేగం కారణంగా జరుగుతున్నదేనని, ప్రపంచంలో ప్రతి 24 సెకన్లకు ఒకరు రహదారి ప్రమాదాల్లో విగతజీవ్ఞలవ్ఞతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో తెలిపింది. రహదారి ప్రమాదాల కారణంగా దేశాలు తమ జిడిపిలో మూడు నుంచి ఐదుశాతం కోల్పోతున్నాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కొన్ని కుటుంబాలు రోడ్డు ప్రమాదాల కారణంగా పేదరికంలో కూరుకుపోయి చిన్నా భిన్నమవ్ఞతున్నాయి. జాతీయ నేరగణాంకాల సంస్థ నివేదిక ప్రకారం ప్రతి మూడు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు.

మృత్యుమార్గాలుగా మారుతున్న రహదారులు

కన్నవారికి కట్టుకున్నవారికి, కుటుంబ పెద్దలను పోగొట్టుకుని అనాధలవ్ఞతున్న వారికి తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. మనదేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదమరణాల్లో 10 శాతం పాదచారులు, 40 శాతం ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు ఉంటున్నారు. దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 13 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఎపిలో 140 రహదారుల్లో తెలంగాణాలోని 53 రహదారుల్లో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నట్లుగా తేలింది. మొత్తం ప్రమాదాల్లో జాతీయరహదారులపైనే 30 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతికంగా అన్ని రంగాల్లో ముందుకుపో తున్న మనం ఈ రహదారులపై జరిగే నరమేధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నామో ఆలోచించాలి. రహదారులపై జరిగే ప్రమాదాల్లో మృతిచెందే వారిలో 18-35 సంవత్సరాల వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు.

రోడ్లపై వాహనాలను నడిపే లైసెన్సులు లేని వాళ్లు, తప్పుడు మార్గాల్లో లైసెన్స్‌లు పొందిన వాళ్లు, నిద్రమత్తులో కొందరు, మద్యం మత్తులో మరికొందరు యమదూతల్లావచ్చి పౌరుల జీవించే హక్కును కాలరాస్తున్నారు. ప్రాణాలు నిలువ్ఞనా తీస్తున్నారు. తెలియనితనం, తెలిసినా నిర్లక్ష్యంవంటి వాటివల్ల విలువైన ప్రాణాలు కళ్లేదుటే అనంత వాయువ్ఞల్లో కలిసిపోతున్నాయి. రహదారి ప్రమాదాల్లో అయిన వారిని పోగొట్టుకుని నిర్జీవంగా కాలం గడుపుతున్న వారిని మన చుట్టూ చూస్తున్నాం. రోడ్డెక్కిన వారు క్షేమంగా ఇంటికి రావడానికి అందరూ కృషి చేయాలి. రహదారి నియమాలను తు.చ తప్పకుండా పాటించాలనే ఆలోచన అందరి మదిలో రావాలి.

విద్యార్థి దశ నుంచే రహదారి భద్రత గురించి స్పష్టమైన అవగాహన కలిగించాలి. రహదారి ప్రమాదాలను తగ్గించడంలో పేదదేశాలు వెనుకబడుతున్నాయి. ధనిక దేశాలతో పోలిస్తే మిగి లిన దేశాల్లో మరణాలు మూడురెట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి లక్షజనాభాలో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య ఆఫ్రికాలో 26 శాతంగా ఉండగా, అభివృద్ధిచెందిన ఐరోపాలో తొమ్మిది శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు ఏటా పదమూడున్నర లక్షల మంది ప్రాణాలు బలిగొంటున్నాయి. సుమారు ఐదుకోట్ల మందిని క్షతగ్రాతులుగా మారుస్తున్నాయి. పోలియోను దేశం నుండి తరిమికొట్టగలిగినా, రోడ్డు ప్రమాదాల కారణంగా అవయవాలను పోగొట్టుకునే వారిని తగ్గించలేకపోతు న్నారు.

నిర్లక్ష్యంగా ఎలాంటి సిగ్నల్‌ లేకుండా వాహనాలను రోడ్లపక్కన నిలిపివేయడంతో ఆ వాహనాలను ఢీ కొట్టి జరిగిన ప్రమాదాలెన్నో ఉన్నాయి. ద్విచక్ర వాహనానదారులందరూ తప్పనిసరిగా హెల్మెట్లు వాడాలి. తక్కువ బరువ్ఞన్న శిరస్త్రాణాలు తయారు చేయాలి. కొన్ని చోట్ల వేగ నిరోధకాలే ప్రమాదాలకు కారణమయి ప్రాణాలు తీస్తున్నాయి. స్పీడ్‌ బ్రేకర్ల నిర్మాణం నిబంధనల ప్రకారం జరగాలి. వాహనదారులు వాటిని గుర్తించగలిగే ఖచ్చితమైన సంకేతాలుండాలి. అతివేగం వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయి.

వాహనాల వేగాలను నియంత్రించగలిగితే 30 శాతం ప్రమాదాలను తగ్గించగలిగే వీలుంటుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చెబుతుంది. వేగనియంత్రణ లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆటోమాటిక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ‘యాంటి లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ లాంటివి వాహనాలకు అమర్చాలి. జరిమానాలు పెంచడంతోనే అంతా అయిపోదు. అంతమాత్రాన జరిమానాలు, శిక్షల వల్ల ప్రయోజనం లేదని అనలేం. జరిమానాల ద్వారా వచ్చే మొత్తాలను ప్రమాదాల నివారణకు ఖర్చు చేయాలి. అన్ని కార్లలో ప్రమాద సమయంలో తెరుచుకునే బ్యాగ్‌లను ఏర్పాటు తప్పనిసరి చేయాలి. రోడ్ల నిర్మాణంలో నాణ్యతను పాటించాలి.

కొత్త చట్టంతో గుత్తేదార్ల మీదకూడా చర్యలు తీసుకునే వీలుంది. జాతీయ రహదారుల విస్తరణలో జాప్యాన్ని నివారించాలి. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైన చోట్ల అండర్‌పాస్‌ల నిర్మాణం జరగాలి. ప్రమాదం జరిగిన తొలి గంటలో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలి.

– రావి శ్రీనివాసరావ్ఞ

====