ఆంధ్రా-కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
25 మందికి గాయాలు..మృతుల సంఖ్య పెరిగే అవకాశం

హైదరాబాద్: ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు వద్ద ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగి, ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మందికి గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కర్ణాటకలోని పావగడ పలవలహళ్లి వద్ద ఈ ఘటన జరిగింది. వైఎన్ హొసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తున్న సమయంలో అధిక వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
బస్సు అదుపు తప్పిన వెంటనే బస్సులోంచి చాలా మంది కిందకు దూకేయడంతోనే మరణాలు సంభవించినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పావగడలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని, గాయాలపాలైన వారికి మెరుగైన చికిత్స అందిస్తామని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బాధితుల్లో తెలుగు వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/