త‌మిళ‌నాడు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా ఆర్ఎన్ ర‌వి ప్ర‌మాణస్వీకారం

చెన్నై: త‌మిళ‌నాడు కొత్త గ‌వ‌ర్న‌ర్‌గా ఆర్ఎన్ ర‌వి ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మ‌ద్రాస్ హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ సాహిబ్ బెన‌ర్జి ఆయ‌న చేత ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. ఈ ఉద‌యం 10.30 గంట‌ల రాజ్‌భ‌వ‌న్‌లో ఈ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మం జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్, మాజీ ముఖ్య‌మంత్రి ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి, కేంద్ర‌మంత్రి ఎల్ మురుగ‌న్‌, ప‌లువురు రాష్ట్ర‌మంత్రులు, త‌మిళ్ మ‌నీలా కాంగ్రెస్ అధ్య‌క్షుడు జీకే వాస‌న్‌, ఎండీఎంకే జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ వైకో, ప‌లువురు రాష్ట్ర ఉన్న‌తాధికారులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

అనంత‌రం ముఖ్య‌మంత్రి స్టాలిన్ త‌న క్యాబినెట్ స‌హ‌చ‌రుల‌ను నూత‌న గ‌వ‌ర్న‌ర్‌కు ప‌రిచ‌యం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఒక పుస్త‌కాన్ని బ‌హూక‌రించారు. అనంత‌రం చీఫ్ జ‌స్టిస్ సాహిబ్ బెన‌ర్జి మ‌ద్రాస్ హైకోర్టు న్యాయ‌మూర్తుల‌ను గ‌వ‌ర్న‌ర్ ర‌వికి పరిచ‌యం చేశారు. తమిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ భ‌న్వ‌రీలాల్ పురోహిత్ పంజాబ్ గ‌వ‌ర్న‌ర్‌గా బ‌దిలీపై వెళ్ల‌డంతో ఆయ‌న స్థానంలో ర‌విని నూత‌న గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మించారు. ఆర్ఎన్ ర‌వి బీహార్ రాజ‌ధాని ప‌ట్నాకు చెందిన వారు. 1976 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆర్ఎన్ ర‌వి.. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌లైన సీబీఐలోనూ, ఐబీలోనూ ప‌నిచేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/